ఖలీల్‌వాడి, జూన్ 3: ప్రతి పల్లె, పట్టణంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 39వ డివిజన్ పరిధిలోని న్యూ ఎన్జీవోస్ కాలనీలో నాల్గో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్‌రావు, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ క్రీడా ప్రాంగణంలో నూతనం గా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ప్రారంభించి మా ట్లాడారు. 60ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణకు విద్యుత్ సరఫరాలో తీరని అన్యాయం జరిగిందన్నారు. కరెంట్ కోతలతో తెలంగాణ ప్రజానీకాన్ని గోస పెట్టారని ఆక్షేపించారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో విద్యుత్ కష్టాలను అధిగమించి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సేద్యానికి సైతం 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రూ.36వేల కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమంతో ఇంటింటికీ శుద్ధమైన తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఏ రంగంలో చూసినా తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తూ యావత్ దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు అందిస్తున్న నిధులు వాటి నిర్వహణకే సరిపోతుండడంతో కొత్తగా మౌలిక సదుపాయాల కల్పనకు వీలుండేది కాదన్నారు. దీనిని గమనించి సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి కేంద్రం అందించే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిధులు సమకూరుస్తున్నారన్నారు.
ఫలితంగా ప్రతి పల్లె, మున్సిపల్ పట్టణాల్లో వైకుంఠధామాలు, పచ్చదనం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రకృతివనాలు వంటి వసతులు అందుబాటులోకి వచ్చాయన్నారు. మూడేండ్లలో పల్లెప్రగతి కింద నిజామాబాద్ జిల్లాకు రూ.405కోట్ల నిధులు మంజూరయ్యాయని వివరించారు. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలకు అదనంగా రూ.3,600 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థకు మూడేండ్లలో రూ.75 కోట్లు మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు. పెద్ద ఎత్తున మంజూరు చేసిన నిధులతో ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతోనే కేంద్రం నిర్వహించిన ఉత్తమ గ్రామపంచాయతీల జాబితాలో తెలంగాణ పల్లెలే ఎంపికయ్యాయని వివరించారు. ప్రజలు వాస్తవాలను గమనించి సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి వెన్నంటి నిలువాలని మంత్రి వేముల కోరారు.
పరిశుభ్రంగా ఉండాలనే..
పట్టణ ప్రాంతాల్లోని ఆయా కాలనీలు పచ్చదనంతో అలరారుతూ, పరిశుభ్రంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. నిరుపయోగంగా మారిన బోరుబావి గుంతలు, శిథిలావస్థకు చేరిన ఇండ్లు, వంగిన విద్యుత్ స్తంభాలను గుర్తించి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన చర్య లు చేపడుతున్నామన్నారు. ప్రజలందరూ పల్లె, పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని వసతులు
ప్రజలకు అవసరమైన అన్ని వసతులను సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. తాగునీటి వసతి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, అర్బన్ పార్కు లు, రోడ్ల నిర్మాణాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు వంటి సదుపాయాలన్నీ సమకూరుతున్నాయని వివరించారు. జిల్లా కేంద్రంలో త్వరలోనే ఐటీ హబ్ అందుబాటులోకి రానున్నదని, కొత్తగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనం, కంఠేశ్వర్ కమాన్ వద్ద ఆర్యూబీ, మినీ ట్యాంక్‌బండ్ పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు. న్యూ ఎన్జీవోస్ కాలనీ కమ్యూనిటీ హాల్ భవన ఆధునీకరణకు రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, రెడ్కో చైర్మన్ అలీం, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లతాకృష్ణ పాల్గొన్నారు.