రుద్రూర్, జూన్ 3: ప్రజాసేవలో ముందడుగు వేయడమే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభంతోపాటు పల్లె ప్రగతి కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో సీఎం కేసీఆర్‌లాంటి అభివృద్ధి చేసే పాలనను చూడలేదన్నారు. అభివృద్ధి చేసే నాయకులను ఆదరిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పల్లెల సమగ్రాభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిని చేపడుతున్నదని, ఇందులో భాగంగా గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
రుద్రూర్ నుంచి బొప్పాపూర్ వెళ్లే దారిలో రూ.58లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని స్పీకర్ పోచారం ప్రారంభించారు. 30 డబుల్ బెడ్రూం ఇండ్లు, రూ.20లక్షలతో చేపట్టనున్న ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులు, సీసీ రోడ్లు, రూ.33లక్షలతో నిర్మించనున్న హనుమాన్ ఆలయ నిర్మాణానికి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. బొప్పాపూర్‌లో ఇప్పటి వరకు రూ.6కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామస్తుల వినతి మేరకు హనుమాన్ ఆలయ నిర్మాణానికి మరో రూ.5లక్షలు, మసీదు ప్రహరీకి రూ.5లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, బొప్పాపూర్-హుమ్నాపూర్ గ్రా మానికి రోడ్డు, బొప్పాపూర్ నుంచి పాత వర్ని వరకు రోడ్డు వేయించే ప్రయత్నం చేస్తామన్నారు. రుద్రూర్ నుంచి బొప్పాపూర్ వరకు డబుల్ రోడ్డు వేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్, ప్రత్యేక అధికారిణి శశిరేఖ, సర్పంచ్ బాపూజీ సావిత్రిలింగం,రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, ఏఈ నాగేశ్వర్రావు, ఎండోమెంట్ అధికారి సోమయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ పాల్గొన్నారు.