ఇందూరు/ఖలీల్‌వాడి, జూన్ 3 : యూపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 136వ ర్యాంకు సాధించిన అరుగుల స్నేహకు నగరవాసులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అంబేద్కర్ కాలనీకి చెందిన స్నేహ సివిల్స్‌లో ర్యాంకు సాధించిన అనంతరం మొదటిసారి జిల్లాకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఆమెకు కాలనీవాసులు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. కుటుంబసభ్యులు, బంధువులు, కాలనీవాసులు నృత్యాలు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సివిల్స్ ర్యాంకర్ స్నేహను సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంపికవ్వడం అందరికీ గర్వకారణమని, నగర అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు.
అతి చిన్న వయస్సులోనే మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిందని, యెండల సౌందర్య దాదాపు 45దేశాల్లో హాకీ ఆడిందని, ఫుట్‌బాల్ పోటీల్లో అంతర్జాతీయ ప్లేయర్ గుగులోత్ సౌమ్య చాంపియన్‌గా నిలిచిందని, ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ చాంపియన్‌గా నిలిచిందని, షూటర్ ఈషా సింగ్ సైతం గోల్డ్‌మెడల్ సాధించినట్లు వివరించారు. పేద కుటుంబానికి చెందిన అరుగుల స్నేహ కష్టపడి చదివి సివిల్స్‌లో 136వ ర్యాంకు సాధించి నిజామాబాద్‌కు మరింత వన్నె తెచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, రెడ్కో చైర్మన్ ఎస్.అలీం, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు కాంపల్లి ఉమారాణి, నిచ్చేంగి లత, టీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు, నాయకులు పాల్గొన్నారు.