నందిపేట్ మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని రైతులు కూరగాయలను సాగు చేస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే పంట చేతికందడంతో కూరగాయలను మార్కెట్‌కు తరలించి విక్రయించడంతో నిత్యం చేతికి డబ్బులు వస్తున్నాయి. రోజుకు కనీసం రూ.1500 నుంచి రూ. 2వేలకు పైగా సంపాదిస్తున్నారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో నిర్వహించే సంతలో కూరగాలు విక్రయించి మూడు నాలుగు రెట్ల ఆదాయం పొందుతున్నారు. ప్రధానంగా టమాట, మిర్చి, బెండకాయ, కొత్తిమీర, మెంతి కూర, పాలకూర ఎక్కువగా సాగు చేస్తున్నారు. డైలీ మార్కెట్లో 20 నుంచి 30 మంది రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారు.
నూతన పద్ధతులతో అధిక దిగుబడి..
శ్రమను తగ్గించుకోవడంతోపాటు దిగుబడులు పెరిగేలా సాగులో పలువురు రైతులు నూతన పద్ధతులను అవలంబిస్తున్నారు. మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే మల్చింగ్ విధానాన్ని మండలంలోని రైతులు సైతం అనుసరిస్తున్నారు. మల్చింగ్ పేపర్‌ను ఉపయోగిస్తే కలుపు మొక్కల బెడద, నీటి వినియోగం తగ్గి దిగుబడి చాలా వరకు పెరుగుతుంది. దీంతోపాటు డ్రిప్ విధానంతో మొక్కలకు నేరుగా నీటిని అందిస్తున్నారు. డ్రిప్ విధానం ద్వారా సాగునీటి వృథా చాలా వరకు తగ్గుతుంది. పైగా నీటితోనే ఎరువులు, తెగుళ్ల నివారణ కోసం వినియోగించే రసాయనాలను కలిపి నేరుగా మొక్కకు అందించడానికి డ్రిప్ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. కూరగాయలు సాగు చేసే రైతులు సగం పొలంలో ఎప్పుడూ పూత, కాత దశలో ఉండేలా, మిగితా సగం పంట కోత దశకు వచ్చేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మొత్తం మీద ప్రతిరోజూ కూరగాయలను మార్కెట్‌కు తరలించేలా చూస్తున్నారు.
-నందిపేట్, మే 27
సంప్రదాయ పంటలను పక్కనబెట్టి వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తే యేడాది కాలమంతా చేతికి డబ్బులు వస్తాయి. ఇందులో భాగంగా చాలా మంది రైతులు తక్కువ పెట్టుబడి ఖర్చులు ఉన్న కూరగాయలను సాగుచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
దుబాయ్ నుంచి వచ్చి కూరగాయలు సాగు చేస్తున్న దుబాయ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి కూరగాయలే పండిస్తున్న. నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. అందులో ఎకరం కూరగాయల కోసం కేటాయించాను. ఎప్పుడూ అర ఎకరం కూరగాయల కోత కోసం సిద్ధంగా ఉంటుంది. యేడాది కాలమంతా కూరగాయల అమ్మకం కొనసాగుతూనే ఉంటుంది. రోజూ చేతిలో డబ్బులు వచ్చి పడుతాయి.
-దొడ్డికింది ముత్యం, రైతు, నందిపేట్