కూరగాయల సాగు.. బహుబాగు.. అనే నినాదం ఎడపల్లి మండలంలోని ఒడ్డాపల్లి గ్రామంలో కనిపిస్తుంది. మండలంలో సుమారు 12,400 ఎకరాల భూములు సాగు చేస్తుండగా, ఇందులో సుమారు 220 ఎకరాల్లో కూరగాయలే పండిస్తారు. కేవలం ఒడ్డాపల్లి గ్రామంలోనే 120 ఎకరాలకు పైగా కూరగాయల సాగు చేస్తున్నారు. గ్రామంలోని దాదాపు అన్ని కుటుంబాలు తమకున్న పొలంలో కొంత భూమిని కూరగాయల సాగుకు కేటాయిస్తున్నారు. చిన్న గ్రామమే అయినా, గ్రామంలో ఎక్కడ చూసినా కూరగాయలే కనిపిస్తాయి. ప్రతి ఇంటిని ఆనుకొని ఉన్న భూముల్లో కూరగాయలు పండిస్తూ సమీప ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలిస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కూరగాయలు పండించడంతో నిత్యం డబ్బులు వస్తున్నాయని రైతులు, గ్రామస్తులు చెబుతున్నారు.
-శక్కర్‌నగర్, మే 27
ఏండ్ల నుంచి సేంద్రియమే..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు సిరివేణి పుష్ప. ఒడ్డాపల్లిలో ఉన్న వ్యవసాయ భూమిలో ఏటా ఒకటి లేదా రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. చిక్కుడు, దొండ, పుంటికూర, మెంతికూర, గోరుచిక్కుడు, కొత్తిమీరను పండిస్తారు. వీరు పండించే కూరగాయలకు ఎలాంటి రసాయన మందులు, ఎరువులు వినియోగించరు. కేవలం సేంద్రియ ఎరువులతోనే ఈ కూరగాయలను పండిస్తుంటారు. సమీపంలోని మార్కెట్‌కు రోజూ వివిధ రకాల కూరగాయలను తరలించి విక్రయిస్తుంటారు. దీంతో నిత్యం రూ.1500లకు పైగానే సంపాదిస్తున్నారు. సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేస్తున్న పుష్పను రుద్రూర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అధికారులు ఉత్తమరైతుగా గుర్తించి సన్మానించడం విశేషం.
కూరగాయలతో లాభమే..
మాకున్న సాగుభూమిలో యేటా ఒకటి, రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు చే స్తాం. మిగతా భూమిలో వ్యవసాయ పం టలు పండిస్తాం. కూరగాయల సాగులో రసాయన ఎరువులు వాడం. వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది సలహాలు పాటిస్తూ పంటలు పండిస్తాం. కూరగాయల సాగు మిగతా పంటల కన్నా లాభసాటిగానే ఉంటుంది. నిత్యం డబ్బులు కనిపిస్తాయి. మా గ్రామంలో చాలా మంది కూరగాయలు సాగు చేస్తూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు.
– సిరివేణి పుష్ప, ఆదర్శ రైతు