ఒక్క నెలలో రూ.3లక్షల సంపాదన
శంకోరా తండాకు చెందిన యువరైతు కెతావత్ రవీందర్ మూడెకరాల పొలం కౌలుకు తీసుకొని టమాట పంట సాగు చేశాడు. ఇదే సమయంలో టమాటకు మంచి ధర పలికింది. 25 కిలోల బాక్సు మార్కెట్లో వెయ్యి రూపాయల నుంచి రూ. 1400 ధర రావడంతో ఎకరానికి రూ. లక్ష చొప్పున మూడెకరాలకు నెల రోజుల్లోనే రూ. 3లక్షలు సంపాదించానని తెలిపారు. ఇటు పొలం పనులు చేసుకుంటూనే ఖాళీ సమయంలో చదువుకుంటూ పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్నానని తెలిపాడు. పొలం పనులతో ప్రత్యేకంగా తనకు వ్యాయామం చేయాల్సిన పనిలేదని అంటున్నాడు.
-చందూర్, మే 27
బాల్కొండ, మే 27 : ధాన్యం సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయడంతో.. సీఎం కేసీఆర్ సూచన మేరకు చాలామంది రైతులు ఇతర పంటలపై దృష్టి పెట్టారు. నిత్యం ఆదాయం వచ్చే కూరగాయలను సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల్కొండ మండలంలోని వన్నెల్(బీ) గ్రామానికి చెందిన దేవన్న టమాట పంటను పండిస్తున్నాడు. మార్కెట్లో ప్రస్తుతం టమాటకు మంచి డిమాండ్ ఏర్పడడంతో ఎకరానికి రూ. 5 లక్షల ఆదాయం సమకూరింది.
పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ..
టమాట సాగుకు పెట్టుబడి చాలా తక్కువ. మార్కెట్లో పంట ధర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మంచి లాభాలే వస్తాయని దేవన్న వివరించారు. ఎకరం భూమిలో టమాట సాగు చేసేందుకు విత్తనాలకు రూ. 8వేలు, పురుగు మందులు స్ప్రే చేసేందుకు రూ. 10వేల దాకా ఖర్చయ్యిందని తెలిపాడు. దిగుబడి ప్రారంభమయ్యాక వారానికి మూడుసార్లు పది మంది చొప్పున కూలీలకు రూ.10 వేల వరకు చెల్లించి పంటను కోయించానని చెప్పాడు. ప్రస్తుతం టామట పెట్టె ధర వెయ్యి రూపాయల నుంచి రూ.1200 వరకు ఉండడంతో కేవలం నాలుగు నెలల వ్యవధిలో సుమారు రూ. 5 లక్షల వరకు ఆదాయం సమకూరిందని సంతోషం వ్యక్తంచేశాడు.
మంచి లాభాలు ..
వరి పండిస్తే కేంద్ర ప్రభుత్వం కొంటదో.. లేదోనని సీఎం కేసీఆర్ చెప్పినట్టు కూరగాయలు సాగు చేశాను. తక్కువ పెట్టుబడి ఉంటుందని.. ఎకరం భూమిలో టమాట పంట పండించిన. దిగిబడి వచ్చే సమయానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. దీంతో నాలుగు నెలల్లోనే రూ. 5 లక్షల ఆదాయం వచ్చింది.
-పన్నలా దేవన్న, రైతు, వెన్నెల్(బీ)