మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రైతులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం మరాఠాలను ఆకర్షిస్తోంది. ఇక్కడ మాదిరిగా తమ ప్రాంతంలో కూడా సంక్షేమ ప థకాలు అమలు కావాలని మన జిల్లా సరిహద్దుకు ఆనుకుని ఉ న్న మహారాష్ట్రలోని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే విషయమై అక్కడి పాలకులను కొన్నేండ్లుగా పెద్ద ఎత్తున నిలదీస్తూ వచ్చా రు. రాష్ట్రంలో కేసీఆర్ మాదిరిగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడం తమ నేతలకు చేతకాదని నిర్ణయించుకున్నారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ మహారాష్ట్ర పల్లెల్లో ఉద్యమం మొదలైంది. ఇది జరిగి మూడేండ్లు అయ్యింది. కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతూ గులాబీ జెండాలను మరాఠా గడ్డపై ఎగురవేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టీఆర్ఎస్ టిక్కెట్లు ఇవ్వాలంటూ మరాఠా నేతలు హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే.. తాజాగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రానున్నారన్న వార్తలు వారిలో మహారాష్ట్రవాసుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. కేసీఆర్ ప్రధాని అయితే దేశమంతటా అభివృద్ధి జరుగుతుందని వారు భావిస్తున్నారు. దీంతో తమ ప్రాంతం తెలంగాణలో భౌతికంగా కలవకపోయినా, అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలు అందుతాయని ఆశిస్తున్నారు.
బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ పోరాట పటి మ, కార్యదక్షతపై కొన్నేండ్లుగా పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఎంతో నమ్మకం పెంచుకున్నారు. దీనికితోడు మహారాష్ట్ర పాలకులు నాందెడ్ జిల్లా సరిహద్దులో ఉన్న అనేక నియోజకవర్గాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం, గ్రామీణ ప్రాంతా ల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర కారణాలతో అక్కడి ప్రజల్లో అసహనం గూడుకట్టుకున్నది. దీంతో తమ ప్రాంతాలను తెలంగాణలో విలీనం చేయాలన్న డిమాండ్ మొదట్లో ధర్మాబాద్, బిలోలి తాలూకాల్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ, తర్వాత ఆ డిమాండ్ నాందెడ్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు పాకింది.
మూడేండ్ల కిందట మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తమకు టీఆర్ఎస్ టిక్కెట్లు ఇవ్వాలని మరాఠా నేతలు హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కోరారు. వీరిలో నాందెడ్ జిల్లాలోని దెగ్లూర్-బిలోలి, నాయిగావ్, బోకర్, కిన్వట్, హథ్‌గావ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. అప్పట్లో కేసీఆర్ వారికి సర్ధిచెప్పి పంపించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ధర్మాబాద్‌లో ఏకంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలతో మరాఠా నేతలతో పాటు అక్కడి ప్రజలు సంబురపడుతున్నారు.
మరాఠ్వాడాలో అర్హులైన వృద్ధులు, వితంతువులందరికీ పింఛన్లు అందడంలేదు. ఇక్కడ వృద్ధాప్య, వితంతు తదితర పింఛన్ల కింద నెలకు రూ.2,116 ఇస్తుండగా, అక్కడ కేవలం రూ.600 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా అక్కడి అర్హుల్లో సగం మందికి కూడా రావడంలేదని స్థానిక నేతలు అంటున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు తమకు లేకపోవడం వారిని ఆలోచింపజేస్తోంది. మహారాష్ట్రలో ఉండడమే తమ దురదృష్టంగా భావిస్తున్న ప్రజలు.. మహారాష్ట్ర పాలకులపై తిరుగుబాటుకు గులాబీ జెండాను, అందుకు సీఎం కేసీఆర్ మద్దతును కోరుకుంటున్నారు.
భారత్‌కు కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి.. దేశ్ కీ నేత కేసీఆరే.. ఆయనకు పేద, బడుగ, బలహీనవర్గాల ప్రజల సమస్యలు తెలుసు. ఎప్పటికప్పుడు పేదల కోసం, దళితుల కోసం తెలంగాణలో పథకాలు ప్రవేశపెట్టిండు. దళితబంధు పథకంలాంటి పథకం కేసీఆర్‌కే సాధ్యమయింది. ఒక్క కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తారన్న విషయం దళితులు కూడా కలలో సైతం ఊహించలేదు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. కేసీఆర్‌తోనే దేశంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తెలంగాణలో మాదిరిగా మహారాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి..
– ఉపేంద్ర ప్రచండ, యువకుడు, ఏస్గి
కేసీఆర్ సార్ ఎవరికైనా బిడ్డ పుడితే మేనమామలాగా కిట్లు ఇస్తున్నాడు.. ఆడ పిల్లకు పెండ్లయితే కల్యాణలక్ష్మి పైసలు ఇస్తున్నాడు. ముసళోళ్లకు, గరీబోళ్లకు పింఛన్లు ఇస్తున్నాడు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణలో పుడితే ఎంత మంచిగుండే అనిపిస్తుంది. మా ఊరు ఏస్గికి తెలంగాణ హద్దు రెండు కిలోమీటర్లే.. అయితే, అక్కడికి, ఇక్కడికి మస్తు ఫరాక్ ఉంది.. కేసీఆర్ సార్ దేశానికి ప్రధాని అయితేనే సౌలత్లన్నీ మాకు కూడా అందుతాయి.
– సక్కుబాయి ఒఠానే, ఏస్గీ