శక్కర్‌నగర్, మే 20 : ఏర్గట్ల మండలం దోంచంద వీడీసీ సభ్యులు ఇటీవల గొర్రెలను నిర్బంధించడంతోపాటు గొల్ల, కుర్మలపై దాడి చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం బోధన్ నియోజకవర్గ అధ్యక్షుడు, గొల్ల కుర్మల ఐక్యవేదిక నాయకుడు రవీందర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. బోధన్ పట్టణంలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దోంచందలో వీడీసీని ఏర్పాటు చేసి గొల్లకుర్మల నుంచి డబ్బులు, జీవాలను డిమాండ్ చేయడం శోచనీయమని అన్నారు. గొల్ల కుర్మలపై దాడికి పాల్పడిన వీడీసీపై పోలీసు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నక్క లింగారెడ్డి, కుర్మ వీరయ్య, సింగం భరత్ యాదవ్, జీ వెంకటేశ్ యాదవ్, కే శంకర్, పోశెట్టి పాల్గొన్నారు. సమావేశానికి మాల మహానాడు, టీఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.