వనపర్తి, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానికులైన యువతకు మాత్రమే 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయని వ్యవసాయ, మార్కెటింగ్ శా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ యువతకే ఎక్కువ ఉద్యోగాలు రావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని తెలిపారు. పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ, యువకులకు సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వనపర్తిలోని మంత్రి నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గతంలో 20శాతం ఉద్యోగాల్లో ఓపెన్ కేటగిరీలో భర్తీచేసేవారన్నారు.
అవే ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తే తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని భావించి, వాటిని సవరించిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందుకే కొత్త జోన్లు, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం అయ్యాయన్నారు. ఆంధ్రోళ్లకు 20శాతం ఉద్యోగాలు దక్కాలనే నోటిఫికేషన్ల కోసం షర్మిల వంటి ఆంధ్ర నాయకులు రాద్ధాంతం చేశారన్నా రు. యువత అటువంటి నాయకుల నమ్మి మోసపోవద్దని అన్నారు. వారి మాటల వెనుక అంతరార్థం తెలుసుకోవాలని కోరారు. కష్టపడి విజ యం సాధించిన ప్రస్తుత నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి జీవితాన్ని యువతీయువకులు ఆదర్శంగా తీసుకోవాలని ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ఆయన ఇంటర్వ్యూను ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. యువత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.