ఖలీల్‌వాడి మే 17: వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తమ పనితీరుని మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వైద్యారోగ్యశాఖ ప్రగతిని మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు, ఇమ్యునైజేషన్ తదితర వివరాలను తెలుసుకున్నారు. ప్రభు త్వ రికార్డుల్లో ఏ ఒక్క గర్భిణి వివరాలు నమోదకాకపోయి నా, వేతనాల్లో కోత విధిస్తామన్నారు. గర్భిణుల వివరాల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ప్రభు త్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. అవసరమైతే తప్ప ప్రైవేట్ దవాఖానల్లో సిజేరియన్లు చేయొద్దని హెచ్చరించారు. పీహెచ్‌సీల పనితీరును సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలన్నారు. పైలేరియా, లెప్రసీ, టీబీ తదితర వ్యాధుల లక్షణాలు ఉన్న వారి శాంపిళ్లను సేకరించాలన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పల్లెప్రగతి కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది విధిగా పాల్గ్గొనాలని ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ రాష్ట్ర సంయుక్త సంచాలకుడు రాజేశ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం, తుకారాం రాథోడ్, అంజన తదితరులు పాల్గ్గొన్నారు.
వసతి గృహాల మరమ్మతులను వేగవంతం చేయాలి
సంక్షేమ వసతిగృహాల్లో మరమ్మతు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రగతి భవన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి హాస్టల్లో తప్పనిసరిగా నీటి వసతి ఉండాలని, విద్యుత్‌కు సంబంధించి చిన్నపాటి సమస్య కూడా ఉండవద్దన్నారు.
జూన్ 5వ తేదీలోగా పనులను పూర్తి చేయాలన్నారు. నిరుద్యోగులకు కొనసాగుతున్న ఉచిత శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి శశికళ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.