ఖలీల్వాడి/ భీమ్గల్, మే 16 : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగవల్లి శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ధర్నాచౌక్లో, దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో భీమ్గల్ మండలకేంద్రంలో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మలను సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్.. అదే రాజ్యాంగాన్ని మారుస్తామని, రాజ్యాంగంపై గౌరవం లేని విధంగా మాట్లాడినందుకు ఆయనపై రాజద్రోహం కేసు పెట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని, భేషరతుగా క్షమాపణ చెప్పకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుండారం మోహన్, మాదిగ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లత, నగర ఇన్చార్జి సల్లూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు సుధాకర్, జిల్లా సహాయ కార్యదర్శి లోలం భూమన్న, వెంకటి, దుర్గయ్య, రాజయ్య, బాబయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.