కమ్మర్పల్లి, మే 16 : బాల్కొండ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మంత్రి సమక్షంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్, ముచ్కూర్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన 70 మంది నాయకులు, కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరడం శుభ పరిణామమన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు, చెక్‌డ్యాముల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. బాల్కొండ నియోజకవర్గానికి ప్యాకేజీ-21 ద్వారా త్వరలోనే సాగునీరు అందించనున్నామని చెప్పారు. చాలామంది వచ్చి మాట్లాడిపోతారు.. కానీ వారి పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో కన్నా ఆదర్శవంతమైన పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, అమిత్‌షా తమ పార్టీల పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేశాకే మాట్లాడాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు ఎందుకు లేవో సమాధానం చెప్పాలన్నారు. వారు పాలించే రాష్ర్టాల్లో ఈ పథకాలు అమలుచేయకుండా మాట్లాడితే ఇక్కడి ప్రజలు నమ్మబోరన్నారు. దేశంలో గుజరాత్ సహా అన్ని రాష్ర్టాల్లో కరెంటు కోతలు చూస్తున్నామని, సీఎం కేసీఆర్ ముందుచూపు ద్వారా తెలంగాణలో కరెంటు కోతలు లేవన్నారు.
జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయడమే తప్ప బీజేపీ నేతలు అందుకు ఆచరణీయమైన పనులు మాత్రం చేయడం లేదని విమర్శించారు. నిజమైన హైందవ ధర్మం అంటే దాన్ని రక్షించడమేనని, మాటలతో రెచ్చగొట్టడం కాదని హితవు పలికారు. తాను బాల్కొండ నియోజకవర్గంలో 50 ఆలయాలు కట్టించానని.. ఎంపీ అర్వింద్ ఒక్క గుడినైనా ఎందుకు కట్టించలేదని ప్రశ్నించారు. రెచ్చగొట్టే మాటలతో కాకుండా అభివృద్ధిలో తమతో పోటీపడాలని సలహాఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ భీమ్‌గల్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జనరల్ సెక్రటరీ షఫీ, బాబాపూర్ ఎంపీటీసీ సభ్యుడు సుర్జీల్, సర్పంచ్ అతీఖ్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్, సర్పంచ్ బండి శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేశ్వర్, ఉపసర్పంచ్ భూమేశ్, యూత్ ప్రెసిడెంట్ రమేశ్ పాల్గొన్నారు.