పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. దీంతో ప్రస్తుతం విద్యార్థులంతా ప్రిపరేషన్లో మునిగితేలుతున్నారు. 10కి 10 జీపీఏ లక్ష్యంగా ప్రిపరేషన్‌ను పరుగులెత్తిస్తున్నారు. పరీక్షల ముంగిట నిలిచిన విద్యార్థులు అందుబాటులో ఉన్న ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా.. ఆయా సబ్జెక్టుల్లో ఏయే అంశాలపై దృష్టిపెట్టాలి. పరీక్షలో ప్రజెంటేషన్ ఎలా ఉండాలి.. టాప్ గ్రేడ్ సాధించేందుకు ఏం చేయాలో నిపుణులు చెబుతున్న సూచనలపై ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక కథనం..
తెలుగులో అధికమార్కుల సాధన సులభం
ఈసారి మొత్తం 80 మార్కులకు ఒకటే పేపర్. పార్ట్-ఏ, పార్ట్-బీగా ఉంటుంది. మొత్తం సిలబస్‌లో 9 పాఠాలున్నాయి. ఇందులో 4 పద్యభాగం, 5 గద్యభాగం పాఠాలు ఉపవాచకంగా రామాయణం ఉన్నది. ప్రశ్నపత్రాన్ని విశ్లేషించి చూస్తే అవగాహన ప్రతిస్పందనలో పరిచిత గద్యం అంటే రామాయణంలోని ఒక ప్యారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలకు జవాబులు రాయమంటారు. దీనికి 5 మార్కులు. పరిచిత పద్యం కింద, మూడు పద్యాల్లో నుంచి ఒక దానికి మాత్రమే పద్యపురాణం భావం లేదా ప్రతిపదార్థాలు రాయాలి. పద్యపాఠాలు అయిన దానశీలం, వీరతెలంగాణ శతకమధురిమ వీటిలో దేనినైనా ఒకదానిలోని పద్యాలు అన్నీ నేర్చుకుంటే చాలు. అపరిచిత పద్యం కింద ప్రశ్నలు, పట్టిక ప్రశ్నలు తయారీలాంటివి ఇవ్వొచ్చు. పద్యానికి 10 మార్కులున్న విషయం మరువొద్దు. సంక్షిప్త సమాధాన ప్రశ్నల్లో ఆరు నుంచి మూడు మాత్రమే రాయాలి. ఇందులో రెండు ప్రశ్నలు కవి పరిచయాలే ఉంటాయి. మొత్తం కవి పరిచయాలు నేర్చుకుంటే రెండు వచ్చినట్లే. మిగతా ప్రశ్నల్లో పద్యభాగం నుంచి రెండు, గద్యభాగం నుంచి రెండు – ఏ మూడు అయినా రాయవచ్చు. పద్యభాగంలోని 4 పాఠాల్లో చిన్నప్రశ్నలు చదువుకున్నా.. గద్యభాగంలోని 5 పాఠాలను చదువుకున్నా ఏదో ఒక్కటైనా చాలు. వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో రెండు పద్యభాగం, రెండు గద్యభాగం, రెండు రామాయణంలోనివి ఉంటాయి. ఇందులో కూడా ఏ మూడు ప్రశ్నలకైనా జవాబులు రాయాలి. 4 పద్యభాగాలు మొత్తం నేర్చుకున్నారంటే ప్రధానంగా వాటిలోని కథ లేదా సారాంశాలు నేర్చుకుంటే రెండూ వచ్చినట్లే. అలాగే గద్యభాగం నుంచి కూడా అంటే పద్య, గద్య భాగాల్లో ఏ ఒక భాగాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నా రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు. రామాయణంలో మొత్తం మీద ఒకటి, రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు. రామాయణంలోని కథలు అనగా మాయలేడి వృత్తాంతం, తాటిక వధ, కబంధుని, శివధనుర్భాగం, రామరావణ యుద్ధం, మొదలగు వృత్తాంతాలను చదువుకోవాలి. సృజనాత్మక ప్రశ్నల్లో లేఖ, సంభాషణ, కరపత్రం, ఇంటర్వ్యూ, నినాదాలు/సూక్తులు, వ్యాసం, ఆత్మకథ మొదలగు ప్రక్రియలను అవగాహనతో నేర్చుకోవాలి. అక్కడ ఏది ఇచ్చినా రాయవచ్చు.
– డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, తెలుగు భాషోపాధ్యాయులు, జడ్పీహెచ్ఎస్ గుండారం
హిందీ ఎప్పుడూ ఒకే పేపర్ ఉంటుంది
హిందీ అప్పుడు, ఇప్పుడూ ఒక్కటే పేపర్ ఉంటుంది. సమయం 3 గంటల 15 నిమిషాలు. ఇందులో పార్ట్-ఏ 60 మార్కులు, పార్ట్-బీ 20 మార్కులుగా విభజించారు. ముఖ్యంగా బరస్తే బాదల్, ఈద్గాహ్, కన్ కన్ కా అధికారి, అంతర్ రాష్ట్రీయ స్టార్ పర్ హిందీ, భక్తిపద్, నీతిదోహె, లోక్గీత్, ధర్తికే సవాల్ అంతరీక్ష కె జవాబు, ఉపవాచకం, శాంతికి రహమే, హమ్‌సబ్ ఏక్‌హై, అనోఖ ఉపాయ్ చదివితే మంచి స్కోర్ చేయగలుగుతారు. విభాగం-1 లో శబ్ద బండర్కి సంబంధించిన 10 బహులైచ్చిక ప్రశ్నలు, 10 వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 20 మార్కులుంటాయి. బిట్ పేపర్ దిద్దటం, మళ్లీ రాయడం చేయొద్దు.
కర్తన్ అనుపమ జడ్పీహెచ్ఎస్ పిప్రి, ఆర్మూర్, హిందీ, 9494981400
ఇంగ్లిష్‌లో మార్కులు సాధించడం సులువే
ఇంగ్ల్లిష్‌లో రెండు పేపర్లకు బదులు ఒకే పేపర్ మొత్తం 80 మార్కులకు ఉంటుంది. పార్ట్ ఏ – 40 మార్కులు, పార్ట్ బీ – 40 మార్కులు, 6 యూనిట్ల నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. 2వ, 4వ యూనిట్ నుంచి ప్రశ్నలు రావు. పాఠాలను క్షుణ్ణంగా చదవాలి. పార్ట్ బీ గ్రామర్‌ను ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. వాక్య నిర్మాణం, పద దోషాలు లేకుండా చూసుకోవాలి. ప్రతి బిట్లో ప్రశ్నను అర్థం చేసుకొని సరైన జవాబు రాయాలి. పార్ట్-బీలోని 23 నుంచి 27 ప్రశ్నలను జాగ్రత్తగా రాయాలి. ఆంగ్లంలో 10 జీపీఏ సాధించాలంటే ప్రతి బిట్‌ను జాగ్రత్తగా చేస్తే చాలా సులభం. ఇంగ్లిష్ ఫోబియా నుంచి బయటికి రావాలి.
చంద్రశేఖర్ పెందోటి, నందిపేట్ మోడల్ ఉపాధ్యాయుడు. 95504 69917
గ్రాఫ్, త్రిభుజ నిర్మాణం, స్పర్శరేఖలు గీయడం నేర్చుకోవాలి
వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, వైశ్లేషిక రేఖాగణితం, సాంఖ్యాక శాస్త్రం, సంభావ్యత పాఠాలపై పట్టు సాధిస్తే సులువుగా పాస్ అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గ్రాఫ్ లెక్కలు, త్రిభుజ నిర్మాణం, స్పర్శరేఖలు గీయడం, ఎత్తులు దూరాలకు సంబంధించిన సమస్యల్లో సందర్భానికి తగ్గట్లుగా పటాలను గీయడం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా పాస్అవుతారు. మంచి మార్కులు సాధిస్తారు. గణితం 80 మార్కులు ఒక్కటే పేపర్ సమయం 3గంటల 15 నిమిషాల సమయం ఉంటుంది. ఇందులో పార్ట్-ఏ 60 మార్కులు, పార్ట్-బీ 20 మార్కులుగా విభజించారు. ఏ,బీ గ్రేడ్ పిల్లలు కుదించబడిన 70శాతం సిలబస్‌పై పూర్తిగా పట్టు సాధించేందుకు బాగా ప్రాక్టీస్ చేయాలి. 1-7వ పాఠాలు ఏగ్రూప్ గాను 8-14 పాఠాలు బీ గ్రూప్ గా వస్తాయి. సంఖ్యల క్రమానికి ప్రాధాన్యత లేదు. బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
– ఆర్.గోపాలకృష్ణ, ఎస్ఎ మ్యాథ్స్, జడ్పీహెచ్ఎస్ మల్కాపూర్, 94915 88125
బొమ్మలు, భాగాలు గుర్తించాలి..
జీవశాస్త్రం పేపర్ 40 మార్కులు కలిగి ఉంటుంది.
ఈ విద్యా సంవత్సరం మాత్రం తగ్గించిన సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయి. జీవశాస్త్రం చాప్టర్ 1, 2, 3, 4, 5, 6, 8 నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి. పరీక్ష కోసం ఈ చాప్టర్లు మాత్రమే చదవాలి.
పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, నియంత్రణ సమన్వయం విసర్జన, ప్రత్యుత్పత్తి పాఠాలను క్షుణ్ణంగా చదివితే మంచి మార్కులు సంపాదించవచ్చు.
సెక్షన్1లో అతి లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 6లో 3 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. సెక్షన్-2లో లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. 4లో 2 ప్రశ్నలకు మాత్రమే జవాబు రాయాలి. సెక్షన్-3లో వ్యాసరూప ప్రశ్నలు ఇందులో 4లో 2 మాత్రమే రాయాలి. పార్ట్-బీ లో 10 మల్టిపుల్‌చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, ప్రత్యుత్పత్తి పాఠంలో ప్రయోగాలు/కృత్యాలకు సంబంధించిన అంశాలను బాగా ప్రిపేర్‌కావాలి.
మొదటి 6 పాఠాల్లోని బొమ్మలను బాగా ప్రిపేర్ కావాలి. బొమ్మ గీయడం, భాగాలు గుర్తించడం, భాగాల విధులపై అవగాహన కలిగి ఉండాలి.
మొదటి 6 పాఠాల్లోని పట్టికలో ఉన్న అంశాలపై అవగాహన ఏర్పర్చుకోవాలి. పట్టికను విశ్లేషించే సామర్థ్యం కలిగి ఉండాలి.
మొదటి 6 పాఠాల్లోని నిత్యజీవిత వినియోగానికి సంబంధించిన ప్రశ్నలపై అవగాహన ఏర్పర్చుకోవాలి.
– సంజీవ్‌కుమార్, ఎస్ఏ (జీవశాస్త్రం) జడ్పీహెచ్ఎస్ అభంగపట్నం, నవీపేట్.
భౌతికశాస్త్రంలో 1,4,5 చాప్టర్లతో మంచి మార్కులు
1,4,5 చాప్టర్లతో మంచి మార్కులు సాధించవచ్చు. ఫిజికల్ సైన్స్ ఫైనల్ ఎగ్జామ్‌లో ఈసారి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మొత్తం 12 (చాప్టర్)పాఠాల్లో మూడింటిని తొలగించారు. తొమ్మిది పాఠాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో నుంచి మూడు చాప్టర్లు చక్కగా చదువుకుంటే 35 మార్కులు సాధించవచ్చు.
ఎక్కువగా చదవాల్సిన చాప్టర్స్ 1) రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్. 2) హ్యుమాన్ ఐ అండ్ కలర్‌ఫుల్ వరల్డ్, 3) స్ట్రక్చర్ ఆఫ్ అటామ్ 4) క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్, 5) కెమికల్ ఈక్వేషన్స్
వీటిలో కాంతికి సంబంధించిన చాప్టర్‌ను కలిపి చదువుకోవడంతో సులభంగా ఎక్కువ మార్కులు పొందవచ్చు. పరమాణు నిర్మాణం, మూలకాల ఆవర్తన పట్టిక ఈ రెండు చాప్టర్స్ని కలిపి చదువుకోవడంతో సులభంగా అర్థం చేసుకుంటే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
– తెడ్డు నితిన్, జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపల్లి ఉపాధ్యాయుడు. 91602 94247
పట నైపుణ్యం సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి
విషయ అవగాహన, నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, విద్యా ప్రమాణాలపై ప్రశ్నలు, భారతదేశంలో నదులు, పీఠభూములు, నగరాలు, భౌగోళిక ప్రదేశాలు సాధన చేయాలి. ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్థం చేసుకోవడం, పట్టికలు, గ్రాఫ్‌ల విశ్లేషణ ఎంతో ముఖ్యం. ప్రతి ప్యారాగ్రాఫ్‌లో ఒక సమస్య ఉంటుంది. పరిష్కారాలు, ముగింపు ఉండేలా సమాధానాలుండాలి. వెనుకబడిన విద్యార్థులు ఒక్క మార్కు, రెండు మార్కుల ప్రశ్నలపై దృష్టి సారించాలి. పర్యావరణ విద్య, జలవనరుల సంరక్షణ, మహిళ, లింగ వివక్షపై దృష్టి పెట్టాలి. ఏదీ కూడా వదలకుండా ప్రశ్న బాగా చదివి వచ్చినవి అర్థం చేసుకుని రాస్తే మంచి మార్కులు మీ సొంతం.
– నాయక మురళీధర్, యానంపల్లి జడ్పీహెచ్ఎస్ సాంఘిక శాస్త్రం