రెంజల్, మే 15 : రాజ్యాంగాన్ని మార్చడం తమతోనే సాధ్యమవుతుందని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమాన పరిచేలా మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింద్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివారం ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, గాంధీ విగ్రహం వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ (మహాజన సోషలిస్టు పార్టీ) నాయకులు, శ్రీకాంత్, లక్ష్మీగారి భూమయ్య మాట్లాడుతూ .. రాజ్యాంగం ప్రకారం గెలిచిన ఎంపీ అర్వింద్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్యాంగాన్ని అవమాన పరిచేలా మాట్లాడారని అన్నారు. దళిత సంఘాలన్నీ ఏకమై అర్వింద్ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా దూరం చేస్తాయని హెచ్చరించారు. కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలువకుండా చిత్తుగా ఓడిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఏ పార్టీలో రాజకీయంగా ఎదగకుండా భూస్థాపితం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు భూమయ్య, శ్రీకాంత్, నాయకులు సైదులు, గైని కిరణ్, గంగాధర్, గంగాధర్, పోచయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయిలో రాస్తారోకో
రాజ్యాంగాన్ని అవమానపరిచేలా ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కేంద్రంలోని ధర్పల్లి రోడ్డుపై ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకుడు పాశం కుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అవమానపరిచేలా మాట్లాడిన ఎంపీ అర్వింద్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం తగదని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తాననడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మూడేండ్లుగా పదవిలో ఉంటూ కేంద్రం నుంచి ఒక్కపైసా తీసుకురాలేదన్నారు. అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బాండ్ పేపర్‌తో ప్రజలను మోసం చేసి గెలిచి అసత్యపు మాటలు మాట్లాడడాన్ని అందరూ గమనిస్తున్నారని అన్నారు. రాజ్యాంగంపై మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.