నిజామాబాద్, ఫిబ్రవరి 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అది 2018 జూలై 7.. సీఎం కేసీఆర్ తొలి కేబినెట్లో కీలకంగా ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి సేవలందిస్తున్నారు. కీళ్లనొప్పులతో బాధ పడుతున్న పోచారానికి మోకాళ్ల ఆపరేషన్ జరిగింది. నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వారం రోజులపాటు డాక్టర్లు చెప్పినట్టే విన్నారు. ఆ మరుసటి రోజు నుంచి యధాతథంగా పోచారం తన దైనందిన కార్యక్రమాలను ప్రారంభించారు. కాకపోతే తన నివాసాన్నే కార్యాలయంగా మార్చుకొని ఓ వైపు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, మరోవైపు బాన్సువాడ అభివృద్ధి, మిషన్ భగీరథ పథకంపై సమీక్షలు జరుపుతూ సేవలందించారు. నెల రోజులకే తిరిగి జనాల్లోకి వచ్చేశారు. మరింత ఉత్సాహంతో ముందస్తు ఎన్నికలను ఎదుర్కొని తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా 2021, 2022లో రెండుసార్లు కరోనా బారినపడ్డారు. అయినా ప్రజాసేవనుంచి దూరం కాలేదు. తన ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఏడు పదులు దాటిన వయస్సులోనూ యువకులతో పోటీపడే తత్వం పోచారానిది. నియోజకవర్గంలో ఏ సమస్య వెలుగు చూసినా వెనువెంటనే స్పందించే ధోరణి ఆయనది. వారంలో సగానికి ఎక్కువ రోజులపాటు బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. దాదాపుగా ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవంతో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన పోచారం నేడు 73వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న వ్యక్తుల్లో పోచారం శ్రీనివాసరెడ్డి ఒకరు. గతంలో ఒకే రాజకీయ పార్టీలో కలిసి పనిచేసిన అనుభవం. తదనంతరం ఉద్యమ పార్టీలో పోచారం చేరాక… రాష్ట్ర సాధనకు ఉద్యమించారు. స్వరాష్ట్రంలో ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో సీఎంగా కేసీఆర్… తొలి వ్యవసాయ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు. రెండోసారి ఏర్పాటైన సర్కారులో శాసనసభాపతిగా అనుభవానికి పట్టం కడుతూ అత్యున్నతమైన పదవిని పోచారం అలంకరించడం విశేషం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఈ పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రంలో రెండో స్పీకర్‌గా ఆయన నిలిచారు. రాజకీయంలో విశేష అనుభవం ఉన్న పోచారాన్ని కేసీఆర్ లక్ష్మీపుత్రుడిగా పిలుస్తుంటారు. రైతుబిడ్డగా, రాజకీయాల్లో కిందిస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిగా పోచారం పనితీరును చూసిన ముఖ్యమంత్రి ఈ పేరును ప్రస్తావిస్తుంటారు. నీటి తీరువా రద్దు, ఎర్రజొన్న రైతులకు బకాయిల చెల్లింపు, రైతుబంధు పంపిణీ, రైతుబీమా వంటి పథకాలన్నీ పోచారం మంత్రిగా ఉన్నప్పుడే అమల్లోకి రావడంతో పోచారం కాస్తా సీఎం దృష్టిలో లక్ష్మీపుత్రుడయ్యారు.
బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో పరిగె పాపమ్మ, పరిగె రాజిరెడ్డి దంపతులకు జన్మించిన పోచారం శ్రీనివాసరెడ్డి పుట్టుకతోనే రైతుబిడ్డ. కష్టపడి ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన.. వ్యవసాయ పనులు చేసుకుంటూనే చదువును కొనసాగించారు. అనంతరం స్వగ్రామంలోనే తమ పొలం సాగుచేసుకుంటూ జీవనం సాగించారు. కొద్దికాలానికే దేశాయిపేట పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నిక కావడంతో రాజకీయ రంగప్రవేశం మొదలైంది. చిన్నపదవితో ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. గెలుపోటములను సమానంగా చూసే శ్రీనివాసరెడ్డి… అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజా జీవితాన్ని వదల్లేదు. తన నియోజకవర్గంలో నిత్యం కలియ తిరిగే ఆయన.. ప్రతి గ్రామంలో వందలసార్లు పర్యటించి ఉంటారంటే అతిశయోక్తి కాదు. అలాగే నియోజకవర్గంలో ప్రతి పల్లెలోనూ సగం మందిని పేరుపెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి సభాపతి సొంతం.
అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. పేదలకు అందజేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమే అందుకు నిదర్శనం. నియోజకవర్గంలో మొత్తం ఐదువేల పేదకుటుంబాలకు ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 3,500 ఇండ్లను ఇప్పటికే లబ్ధిదారులకు అందించారు. లబ్ధిదారుల ఎంపిక మొదలు నాణ్యతతో ఇండ్ల నిర్మాణం వరకూ పోచారమే స్వయంగా పథకం అమలును పర్యవేక్షిస్తున్నారు.