నిజామాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కామారెడ్డి :తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్(పోసాన్పల్లి)ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించారు. నానమ్మ జ్ఞాపకార్థంగా రూ.2.50కోట్లతో నిర్మించబోయే స్కూల్ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.25 లక్షలతో నిర్మించిన జీపీ భవనాన్ని ప్రారంభించారు. రూ.75లక్షలతో సీసీ రోడ్లకు, రూ.2.40కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు భూమి పూజ చేశారు.
అనంతరం స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కోనాపూర్‌కు వరాల జల్లు కురిపించారు. కోనాపూర్ గ్రామానికి సీసీ రోడ్లు, తాగునీటి కోసం 2కిలోమీటర్ల పైప్‌లైన్, రెండు బస్ షెల్టర్లు, మినీ లైబ్రరీ, మినీ డెయిరీ, మహిళా మండలి భవనం, కొన్ని కుల సంఘాల భవనాలు, గ్రామ పంచాయతీకి ప్రహరీ, పశు వైద్యశాల, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మంజూరు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. బీబీపేటకు ఒక జూనియర్ కాలేజీని మంజూరు చేస్తామన్నారు. రూ .7,300 కోట్లతో విద్యాయజ్ఞం జరుగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ స్థాయి కన్నా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అందులో భాగంగా 26వేల స్కూళ్లు బాగుపడనున్నట్లు వెల్లడించారు.
ప్రతిపక్షాలపై కేటీఆర్ మండిపాటు…
ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతమని, ఇలాంటి ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా నీరందించి సస్యశ్యామలం చేశామని కేటీఆర్ తెలిపారు. ఏప్రిల్, మే నెలలో మానేరు మత్తడి దుంకుతుందని అనుకోలేదని, కానీ ఇవాళ అది ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. 75ఏండ్లలో ఎవరన్నా ఇన్ని పథకాలు అమలు జేసిండ్రా.. ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం, బీబీపేట మండల కేంద్రం, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ కాదా? ఎవడెవడో ఏదేదో ఒర్రుతాండ్రు..వాళ్లను పట్టించుకోవద్దంటూ చెప్పా రు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఎంపీ బీబీపాటిల్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, నిట్టు వేణుగోపాల్‌రావు, కాంట్రాక్టర్ సుభాష్‌రెడ్డి, ఎంపీపీలు నర్సింగ్ రావు, బాలమణి, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, తిర్మల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్
బీబీపేట మండలంతోపాటు కోనాపూర్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరారు. బీబీపేట మండలంగా ప్రకటించి సీఎం కేసీఆర్ ప్రజల కలను నెరవేర్చారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మండలంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. కోనాపూర్‌లో సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. కోనాపూర్ జీపీకి ప్రహరీ, అంగన్వాడీ భవనం, మహిళా సంఘ భవనం, వివిధ కుల సంఘాల భవనాలు, రెండు బస్టాండ్లు, రూ.30లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు, హెల్త్‌సబ్ సెంటర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బీబీపేట మండలంలోని కేజీబీవీ పాఠశాలకు ప్రహరీ, దవాఖానను అప్‌గ్రేడ్ చేయాలని, పెద్ద చెరువు లిఫ్ట్‌కు నిధులు విడుదల చేయించాలన్నారు.
చిల్లరగాళ్లకు బుద్ధి చెబుతాం..
సీఎం కేసీఆర్ పుట్టిన నాటికే వారి తల్లిదండ్రులకు ఐదారు వందల ఎకరాలున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్‌లో గోడలకు సున్నాలు వేసుకునేటోడు, కరీంనగర్లో దుకాణాల్లో చందాలు వసూలు చేసినోళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి సరైన బుద్ధి చెప్పాలని ప్రజలకు హితవు పలికారు. కేసీఆర్ పుట్టుక ఏందో గమనించాలని కాంగ్రెస్, బీజేపీ నేతలకు సూచించారు. తెలంగాణను అనేక రంగాల్లో నంబ ర్ వన్‌గా నిలబెట్టిన నాయకుడిపై చిల్లరగాళ్లు మాట్లాడే మాటలు సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబడ్దార్… ఇక ఊరుకునే సమయం లేదని, మీకు బుద్ధి చెబుతామంటూ ఘాటుగా స్పందించారు. ఆస్తులతో సంబంధం లేకుండా, డబ్బులున్నా లేకున్నా 14ఏండ్లు రాష్ట్ర ఏర్పాటు కోసం మడమ తిప్పకుండా కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. మంత్రి కేటీఆర్ నాయినమ్మ వెంకటమ్మ గారి ఇల్లును చూస్తున్న సందర్భంలో సీఎం కేసీఆర్ యాదృచ్ఛికంగా ఫోన్ చేశారని, కోనాపూర్‌లో ఉన్నానని కేటీఆర్ చెప్పడంతో సీఎం చాలా సంతోషపడ్డారని వివరించారు. ఈ ఊరి మనవడు పేద విద్యార్థుల కోసం హైదరాబాద్‌లోని కాన్వెంట్ స్కూళ్ల మాదిరిగా సొంత డబ్బులు రూ.2.50కోట్లతో స్కూల్ కట్టివ్వనుండడం గొప్ప విషయమన్నారు. ఏడేండ్లలో దాదాపుగా 17వేల పరిశ్రమలు తెలంగాణకు తేవడంలో కేటీఆర్ కృషి మరువలేనిదన్నారు. దీంతో రూ.2.25లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రైవేటు రంగంలో 16లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయని చెప్పారు.