బాల్కొండ, మే 10: సుమారు 300 ఏండ్ల క్రితం నాటి చారితాత్మక హజరత్ సయ్యద్ షా అబుల్ ఫత్హే బందగీ బాద్షా ఖాద్రీ రహమతుల్లాలే బాల్కొండ దర్గా షరీఫ్ ఉర్సు బుధవారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు దర్గా షరీఫ్ సజ్జాద్ ఎ నషీన్ ముతవల్లి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుడు అబుల్ ఫతహ్ సయ్యద్ బందగీ బాద్ షా రియాజ్ ఖాద్రీ మంగళవారం తెలిపారు. దర్గాకు గుసులే షరీఫ్, మహిఫిలే నాత్, తిలావతే ఖురాన్ పఠనంతో ఉర్సు ప్రారంభమవుతుందని చెప్పారు. దేశ నలుమూలాల నుంచి ఇస్లామిక్ స్కాలర్స్ మత గురువులు వస్తారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం దర్గా షరీఫ్‌కు సందల్ (గ్రంథం) ఊరేగింపు పెద్ద ఎత్తున పట్టణ పుర వీధుల మీదుగా కొనసాగి దర్గా షరీఫ్‌లో సమర్పణ జరుగుతుందని ఖాద్రీ తెలిపారు.
ప్రతిభా వంతులైన విద్యార్థులకు అతిథులు బహుమతులను ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఉర్సును పురస్కరించుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయూష్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గుల్బర్గా, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి బాల్కొండ దర్గా షరీఫ్‌కు ప్రత్యేక ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్‌అలీ ప్రత్యేక సందేశం అందించినట్లు ఖాద్రీ వివరించారు.