డిచ్పల్లి, మే 10: మలేరియా నివారణపై నిజామాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించడంతో కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టాయి. దీంతో జాతీయ స్థాయిలో రాష్ర్టానికి, రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి గుర్తింపు లభించింది. గత ఆరేండ్లలో (2015 నుంచి 2021 వరకు) రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ కేసులు గణనీయంగా తగ్గాయి. ఇందుకు నిదర్శనం 2021లో ఒకే ఒక్క కేసు మాత్రమే నమోదు కావడం. 2022లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమో దు కాలేదు. జిల్లాకు జాతీయ, రాష్ట్రస్థాయిల్లోనూ మంచి గుర్తింపు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతోపాటు జిల్లా వైద్యారోగ్యశాఖ నిరంతర కృషి ఫలితమే ఈ మూడేండ్లలో మూడు కేసులు మాత్రమే నమోదుకావడం గమనార్హం. జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి జిల్లాలో నాలుగేండ్లుగా వర్షాకాలంలో జిల్లా వైద్యాశాఖాధికారులు వివిధ శాఖల సమన్వయంతో దోమల నివారణపై ప్రత్యేక దృష్టిసారించారు. నగర పాలక సంస్థ సిబ్బందితో ప్రతిరోజూ దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. పట్ణణ, మండల, గ్రామాల్లో మురికికాలువలను శుభ్రం చేయడంతోపాటు వ్యర్థాలను తొలగించడం తదితర పనులు చేపట్టారు. పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా ఇప్పటికీ ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నారు. పీహెచ్సీలు, యూపీహెచ్సీల పరిధిలోని ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మలేరియా సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహించారు. పోస్టర్లు, స్టిక్కర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్బాల్స్ వేసి దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. మలేరియా అదుపు కోసం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది.
ఒక్క కేసు నమోదు కాలేదు
గతేడాది స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ఇంటింటి సర్వే చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదుకాలేదు. వివిధ శాఖల సమన్వ యంతో మలేరియా నియంత్రణకు కృషి చేశాం. మలేరియా నివారణ కోసం కృషిచేసిన వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు.
-తుకారాం రాథోడ్, జిల్లా మలేరియా నివారణ అధికారి