ఖలీల్‌వాడి, మే 10 : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు జిల్లా పోలీసుశాఖ సహకారంతో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం జాన్కంపేట్‌లోని సీటీసీలో ఏర్పాటు చేసిన కోచింగ్ కేంద్రాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. కేంద్రంలోని సదుపాయాలు, అభ్యర్థుల కోసం సిద్ధం చేసిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. సమయాన్ని వృథా చేయొద్దని, ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అకడమిక్ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ఎంతో తేడా ఉంటుందన్నారు. అకాడమిక్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుందని, పోటీ పరీక్షల్లో మాత్రం అత్యధిక మార్కులతో మెరిట్ సాధిస్తేనే ఉద్యోగం లభిస్తుందన్నారు. కేవలం ఒక్క మార్కు తేడాతో ఉద్యోగం చేజారే ప్రమాదం ఉంటుందని, నూటికి నూరు శాతం సన్నద్ధత అవసరమని సూచించారు. అభ్యర్థులు కోరిన మెటీరియల్‌తోపాటు ఇతర సదుపాయలను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, సీటీసీ ఏసీపీ శ్రావణ్‌కుమార్ ఉన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయాలి
గర్భిణులకు ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు చేయాలని, మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మంగళవారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, వైద్యాధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గడిచిన వారంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 346 ప్రసవాలు కాగా, 191 మంది గర్భిణులు ప్రైవేట్ దవాఖానలో ప్రస వం చేయించుకున్నారన్నారు. క్షేత్రస్థాయిలో అవగాహనకల్పిస్తే గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునేం దుకు ముందుకు వస్తారన్నారు. ప్రతివారం వైద్యశాఖ పనితీరును సమీక్షిస్తానని,పరిస్థితిలో మార్పురానిపక్షంలో చర్యలు తప్పవని స్పష్టం చేశారు.