కామారెడ్డి, మే 9 : సీఎం కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన బీబీపేట్ మండలంలోని కోనాపూర్‌కు మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు నూతన భవనాన్ని తన సొంతఖర్చులతో నిర్మిస్తానని ఇచ్చిన హామీ మేరకు మంత్రి కేటీఆర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గ్రామ శివారులో ఉన్న వాగుపై రూ.2.40 కోట్లతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి ప్రారంభించనున్నారు. గ్రామంలో ఇప్పటికే రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు మంత్రి కేటీఆర్ గ్రామానికి రానున్నారు.
మంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌తో కలిసి పరిశీలించారు. వారి వెంట జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, టీఆర్ఎస్ బీబీపేట మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి అంజనేయులు, వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశం, టీఆర్ఎస్ నాయకులు గండ్ర మధుసూదన్ రావు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.