కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మృతి చెందగా, మరో 15మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారికి నిజామాబాద్, బాన్సువాడ, ఎల్లారెడ్డి దవాఖానల్లో మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
-కామారెడ్డి, మే 9
మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల సహాయం
– వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి
అన్నాసాగర్ రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఆర్థిక సహాయం ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. అన్నాసాగర్ తండా వద్ద జరిగిన ప్రమాదం చాలా విషాదకరమని మంత్రి వేముల అన్నారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాద ఘటన అత్యంత బాధాకరం
– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
అన్నాసాగర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.
సంతాపం తెలిపిన ఎమ్మెల్యే షిండే..
నిజాంసాగర్, మే9: అన్నాసాగర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందంటూ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
మాటలకందని విషాదం.. పవన్‌కల్యాణ్
కామారెడ్డి, మే 9: కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదం జరగడం మాటలకందని విషాదమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు