వేల్పూర్, మే 7: ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని, మూడేండ్లు అయి నా పట్టించుకోకుండా ఎంపీ అర్వింద్ తిరుగుతున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల్పూర్ మం డలం కుకునూర్ గ్రామానికి శనివారం సాయంత్రం అర్వింద్ వస్తున్నాడన్న సమాచారంతో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది రైతు లు వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. పసు పు బోర్డు హామీపై నిలదీసేందుకు ఆరు గంటల పా టు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పసుపు బోర్డుతోపాటు ఎర్రజొన్నకు మద్దతు ధర తెచ్చాకే గ్రామాల్లో ఆడుగుపెట్టాలని, అప్పటి వరకు అడ్డుకుంటూనే ఉంటామని నినాదాలు చేశారు. మోసపూరిత హామీలతో తమను వంచించిన అర్వింద్‌ను ఏ గ్రామంలోకీ రానివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అర్వింద్ కుకునూర్ వస్తున్నట్లు తెలుసుకొన్న రైతులు సాయంత్రం 4 గంటలకు 63వ నంబర్ జాతీయ రహదారి(వేల్పూర్ ఎక్స్‌రోడ్) వద్దకు చేరుకున్నారు. అర్వింద్ గో బ్యాక్.. అర్వింద్ రాజీనామా చేయాలి.. మోసకారి అర్వింద్ అంటూ రైతులు చేసిన నినాదాలతో ఎక్స్‌రోడ్ దద్దరిల్లింది. ఎంపీని అడ్డుకునే వారిని గుండాలుగా పేర్కొనడంపై రైతులు మరింత ఆగ్రహావేశానికి లోనయ్యారు. రాత్రి 9 గంటల వరకు నిరసన తెలిపారు.
తనను నిలదీసేందుకు వేల్పూర్ ఎక్స్‌రోడ్ వద్ద పెద్దసంఖ్యలో రైతులు చేరుకున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎంపీ అర్వింద్ కుకునూర్ పర్యటన రద్దు చేసుకొన్నారు.