నిజామాబాద్ రూరల్, మే 7 : ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించనున్నట్లు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్‌కార్యాలయంలో శనివారం ఆయన వివరాలను వెల్లడించారు. ఆదివారం ఉదయం 10గంటలకు ఉద్యోగార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, 9గంటల వరకు డిచ్పల్లిలోని బెటాలియన్‌కు చేరుకోవాలని సూచించారు. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ఇప్పటివరకు 860 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఆదివారం ఉదయం 8 గంటలకు బెటాలియన్‌లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని స్క్రీ నింగ్ టెస్ట్‌కు హాజరు కావాలనికోరారు. స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను మరుసటి రోజున విడుదల చేస్తామని, ఆ తర్వాత రెండు రోజులకు ఉచిత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు.
రెండు నెలల పాటు ఉచిత శిక్షణ కొనసాగుతుందని, మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ఏడు మండలాల నుంచి టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ఉచిత శిక్షణ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి ముందుకొచ్చారని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలోని యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డిచ్పల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి, డిచ్పల్లి, మోపాల్ మండలాల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, నరేశ్, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు నవీన్‌రెడ్డి, అమీర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.