నిజామాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ 2019 సాధారణ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానన్నారు. లేదంటే రాజీనామా చేసి రైతుల పక్షాన పోరాటం చేస్తానని స్వయంగా బాండ్ పేపర్ రాసిచ్చాడు. ఈ హామీపై అర్వింద్ నోరు విప్పకపోవడంతో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి నేరుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ప్రశ్నను సంధించారు. దీనికి 12 మార్చి 2021నాడు లిఖిత పూర్వకంగా కేంద్రం సమాధానం ఇచ్చింది. దేశంలో ఎలాంటి పంటలకు బోర్డులు ఏర్పాటు చే యడం లేదంటూ కేంద్రం ప్రస్తావించింది. పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదన్నది. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సైతం ఇదే అంశంపై ప్రశ్న అడిగితే మార్చి 16న పసుపు బోర్డు ఏర్పాటు ప్రసక్తే లేదని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం ఇచ్చాడు. కేంద్ర వైఖరి తేటతెల్లమైన సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్రాన్ని, బీజేపీ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ మాత్రం రాజ్యసభ, లోక్‌సభలో టీఆర్ఎస్తో కలిసి రాలేదు. తెలంగాణ రైతు ప్ర యోజనాల కోసం ఇదే రాహుల్ గాంధీతోపాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నోర్లు మూసుకొని మిన్నకుండిపోగా… బీజేపీపై కనీసం నిరసన వ్యక్తం చేయలేదు. తీరా ఇప్పుడు నవ్విపోదురు గాక నాకేంటి అన్న రీతిలో హస్తం పార్టీ తీరు వరంగల్ సభతో స్పష్టమైంది.
నీ మద్దతేది రాహులా?
2019 సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్‌లోని పసుపు రైతులకు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారు. సాక్షాత్తు నాటి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తోపాటు బీజేపీ జాతీయ నాయకుడు రాంమాధవ్‌లు ఎన్నికల బహిరంగ సభల్లో గొంతు చించుకొని హామీలు ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ ఒకడుగు ముందుకేసి ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానంటూ గెలిచిన అర గంటలోనే మీడియాతో మాట్లాడుతూ రైతులను నమ్మించాడు. మూడేండ్లు గడుస్తున్నా పసుపు బోర్డు ఏర్పాటు ప్రక్రియకు అతీగతీ లేదు. ఏడాదిన్నర కాలంగా బీజేపీ పసుపు బోర్డు ఊసే ఎత్తడం లేదు. ఇదేంటని అడిగితే డొంక తిరుగుడు సమాధానం చెబుతూ కేంద్రంలోని బీజేపీ తప్పించుకుంటున్నది. ఈ సమయంలో లోక్‌సభ, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు పసుపు బోర్డు ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్నారు. పైగా వడ్ల కొనుగోలు అంశంలోనూ నిరంతరం వెల్‌లోకి వెళ్లి పార్లమెంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనకు తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఏనాడు మద్దతు ప్రకటించలేదు. సరికదా ఎంపీ హోదాలో ఉన్న కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం తెలంగాణ రైతుల కోసం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. వరంగల్ సభలో మాత్రం రైతు డిక్లరేషన్ పేరిట రైతులను మభ్యపెట్టడం విడ్డూరంగా మారింది.
హస్తం పార్టీ ద్వంద్వ నీతి..
కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలకు వరంగల్‌లో జరిగిన సభ అద్దం పడుతోంది. సభా వేదికపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించిన డిక్లరేషన్‌లో వరి, చెరుకు, పసుపు పంటలకు మద్దతు ధర అందిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. దీంతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ ప్రకటనలను రైతులు తప్పు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రభావం తగ్గిపోయిన కాంగ్రెస్ పార్టీని కర్షకులు నమ్మడం లేదు. ఈ ప్రాం తాన్ని దశాబ్దాల పాటు ఏలిన హస్తం పార్టీ గతంలో పసుపు బోర్డు అంశాన్ని కనీసం పట్టించుకోలేదు. నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచి రెండు పర్యాయాలు 2004 నుంచి 2014 వరకు పని చేసిన మధుయాష్కీ గౌడ్ ఏనాడూ పసుపు బోర్డు ఊసెత్తలేదు. బీజేపీ ఇదే రకంగా దొంగ హామీలిచ్చి రైతుల నుంచి ఓట్లు రాబట్టుకొని హామీ అమలులో విఫలమైంది. రైతులు నిలదీస్తే ఎదురు తిరిగి ఎంపీ అర్వింద్ గుండా గిరి చేస్తూ తప్పించుకుంటున్నాడు. ఇదే రీతిలో కాంగ్రెస్ సైతం చిత్తశుద్ధిలేని ప్రకటనలపై పసుపు రైతులు మండిపడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏకకాలంలో అధికారంలో ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుపై దృష్టి పెట్టని హస్తం పార్టీని నమ్మడం ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
పసుపు బోర్డు డిమాండ్ ఇప్పటిది కాదు. నాలుగున్నర దశాబ్దాల క్రితం నుంచి ఈ ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్నారు. గడిచిన నలభై ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా రైతుల బాధలను ఆలకించకపోవడం విశేషం. ఇదిలా ఉండగా పసుపు బోర్డు హామీ మరిచిన బీజేపీ ఎంపీ అర్వింద్‌ను నిలదీయడంలో నిజామాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు వెనుకడుగు వేయడం వెనుక తెరచాటు రాజకీయాలున్నాయన్న అనుమానాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు జాతీయ పార్టీలు దొందు దొందేనంటూ కర్షకులు మండిపడుతున్నారు.
పసుపుబోర్డు ఊసే ఎత్తనోళ్లు..
అధికారంలో ఉన్నపుడు కనీసం పసుపుబోర్డు ఊసే ఎత్తని కాంగ్రెసోళ్లు ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేస్తాం, మద్దతు ధర కల్పిస్తామని చెబితే వినేవాళ్లు ఎవరూ లేరు. ఇప్పటికే పసుపుబోర్డు పేరుతో బాండ్‌పేపర్ రాసిచ్చి ఒకాయన మోసంజేసిండు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏంజెయ్యనోళ్లు ఇప్పుడు ఇరగదీస్తమని రైతులకు హామీలు ఎందుకిస్తున్నరో అర్థం కాదు.
– అనిల్, రైతు దొన్కల్