ఖలీల్‌వాడి, మే 7 : మాదిగలను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటూ, ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన పార్లమెంట్ స్థాయి సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ దళిత అణగారిన వర్గాలను విద్య, ఉపాధి, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధికి నోచుకోకుండా చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాయమాటలు చెప్పారని, మాదిగ, మాదిగ ఉపకులాల వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటూ మోదీ, అమిత్‌షా జాతిని వంచిస్తున్నారన్నారు. మాదిగలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మాదిగ, మాదిగ ఉపకులాల ఓట్లతో గద్దెనెక్కిన తరువాత జాతిగొంతు కోసిన జాతీయ పార్టీలను అడుగడుగునా అడ్డుకుంటామని అన్నారు. పార్లమెంట్లో స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ వర్గీకరణ అంశాన్ని బీజేపీ ప్రభుత్వం దాట వేస్తున్నదన్నారు. రాజ్యాంగంలో వాళ్లకు అనుకూలంగా అనేక సవరణలు చేస్తూ, దేశంలో కులం, మతం పేరుతో చిచ్చు పెడుతూ దళితుల అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. సమావేశాల ద్వారా జాతిని చైతన్యం చేసి బీజేపీపై మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపుని చ్చారు. సదస్సులో రేగుంట నాంపల్లి, సలేంద్ర బాబురావు, విద్యాసాగర్, సల్లూరు శ్రీనివాస్, పోసాని సుధాకర్ తదితరు లు పాల్గొన్నారు.
తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు
జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ టీఎస్ పార్లమెంట్ స్థాయి సదస్సుకు కోటగిరి మండల కేంద్రం నుంచి నాయకులు తరలివెళ్లారు. నిజామాబాద్‌కు తరలివెళ్లిన వారిలో బస్వాపూర్ సాయిలు, నగేశ్, ఎర్రోళ్ల సురేశ్, ప్రధాన కార్యదర్శి బొర్ర సాయన్న, కార్యదర్శి నెమ్లి నర్సింహులుతోపాటు పొతంగల్, చేతనగర్, తిరుమలాపూర్, కోటగిరికిచెందిన నాయకులు, యువకులు ఉన్నారు.