విద్యానగర్, మే 6: రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించాలని రోడ్డు, రైల్వేస్ అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్య అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రహదారి భద్రత – మన అందరి బాధ్యత అంశంపై శుక్రవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని అన్నారు. విలువైన ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతున్నాయని అన్నారు. రోడ్డు భద్రత విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మన కుటుంబం, సమాజం బాగా ఉంటుందని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని అన్నారు. రాంగ్ రూట్లో వాహనాలను నడపడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు.
సదస్సులో కలెక్టర్ జితేశ్ పాటిల్, నిజామాబాద్ సీపీ నాగరాజు, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఆర్డీవో వాణి, డీఎస్పీ సోమనాథం, సీఐలు, ఎస్సైలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి ఎల్డీఎంగా బాధ్యతలు స్వీకరించిన రమేశ్
కామారెడ్డి ఎల్డీఎంగా చిందం రమేశ్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన రాజేందర్‌రెడ్డి తమిళనాడుకు బదిలీ అయ్యారు. కరీంనగర్ ఎల్డీఎంగా పనిచేసిన రమేశ్.. బదిలీపై కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పాల్గొన్నారు.