ఎన్నో గంటల మేథోమదనం.. మేధావులతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, దీంతో దళితుల దశ మారాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూలీల నుంచి ఓనర్లుగా, సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టు కింద 946మంది లబ్ధిదారులకు 882 యూనిట్లను ఆదివారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమో, ఓట్ల కోసమో ఈ పథకాన్ని ప్రవేశపెట్టలేదని, దళితులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రారంభించామన్నారు. -నిజాంసాగర్, మే 1
నిజాంసాగర్, మే 1: మేధావులతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, దీంతో దళితుల దశ మారాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టు కింద 946మంది లబ్ధిదారులకు 882 యూనిట్లను ఆదివారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమో, ఓట్ల కోసమో ఈ పథకాన్ని ప్రవేశపెట్టలేదని, దళితులు ఆర్థికంగా ఎదగడానికి దళితబంధు పథకం ప్రారంభించామన్నారు.
సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూలీల నుంచి ఓనర్లుగా, సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు. అరవై ఏండ్లుగా దళితుల కోసం అనేక పథకాలు అమలైనప్పటికీ సమాజంలో అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారని అన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ లేకుండా నేరుగా లబ్ధిదారులకే పది లక్షల రూపాయలు అందజేసే పథకం దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టడని, కసితో అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. స్వరాష్ట్రంలో అన్నివర్గాల పేదల సంక్షేమాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
దేశంలో అగ్గి పుడుతుంది..
దళితబంధు పథకంతో దేశంలో అగ్గిపుడుతుందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, మీరెందుకు అమలు చేయడం లేదని మిగతా రాష్ర్టాల ప్రజలు వారి పాలకులను ప్రశ్నిస్తున్నారని వివరించారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ర్టాల్లో ఇలాంటి పథకాలేవీ అమలులో లేవన్నారు. నిజాంసాగర్ మండలంలో సుమారు వెయ్యి మందికి రూ.100కోట్లను దళితబంధు పథకం కింద అందించామని, ఇది బీజేపీ, కాంగ్రెసోళ్లకు కనిపించడం లేదా అని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఉమ్మడి జిల్లాల జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, అదనపు కలెక్టర్లు, ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి, నాయకుడు దుర్గారెడ్డి, జడ్పీ సీఈవో సాయాగౌడ్ పాల్గొన్నారు.
లక్షన్నర పెట్టుబడితో కరోడ్పతినయ్యా…మీరు కూడా కోటీశ్వరులవ్వాలి
30 ఏండ్ల క్రితం మాది పెద్దకుటుంబం. ఆర్థికంగా ఉన్న కుటుంబం. నాన్నకు 100 ఎకరాల భూమి ఉంది. ఇంజినీరింగ్ చదివిన నేను పది లక్షలు ఇవ్వండి.. వ్యాపారం చేసుకుంటానని మానాన్నను అడిగాను. డబ్బు విలువ నీకు తెల్వదంటూ డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు నా మనస్సుకు బాధకలిగి హైదరాబాద్‌కు వెళ్లి ఆర్కిటెక్చర్‌గా నెలకు రూ.800జీతంతో రోజుకు 16 గంటల పాటు పనిచేశాను. రూ.800 జీతాన్ని రూ.16వేలకు పెంచేలా కష్టపడి పనిచేశాను. చివరకు కాంట్రాక్టర్‌గా అవతారమెత్తి 25 సంవత్సరాల్లో నాలుగు వేల ఇండ్లు కట్టి అమ్మిన. హైదరాబాద్‌లో ప్రశాంత్‌రెడ్డి అంటే మంచి బిల్డర్ అనే పేరు సంపాదించుకున్న. మూడు తరాలకు సరిపోయేంత ఆస్తి సంపాదించుకున్నాను. పట్టుదలతో పనిచేసి విజయం సాధించాను. మీరు కూడా రాణించి ఆర్థికంగా ఎదగాలి.
దేశానికే తలమానికం తెలంగాణ : బీబీపాటిల్, ఎంపీ
మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీతోపాటు చెప్పని పథకాలెన్నో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఎంపీ బీబీపాటిల్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న కోరికతో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్, అన్ని రంగాల్లో గణనీయ ప్రగతి సాధిస్తూ దేశానికే తలమానికంగా నిలుపుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో సంగారెడ్డి-నాందెడ్ జాతీయ రహదారి పనులు పూర్తిచేసుకున్నామని, మెదక్-ఎల్లారెడ్డి-బోధన్ రహదారి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, మరో ఏడాదిలో కరీంనగర్-ఎల్లారెడ్డి-పిట్లం రహదారి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మొన్నటి వరకు డ్రైవర్లు నేటి నుంచి ఓనర్లు: హన్మంత్‌షిండే,ఎమ్మెల్యే
మొన్నటి వరకు డ్రైవర్లుగా పనిచేసిన వారంతా దళితబంధు పథకంతో నేటి నుంచి ఓనర్లుగా మారారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు అందజేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నారు. పది లక్షలు తీసుకున్న లబ్ధిదారుడు వచ్చే సంవత్సరం నాటికి 20 లక్షలు జమ చేసి ఆర్థిక స్వావలంబన సాధించాలని తెలిపారు. అనంతరం సింగీతం గ్రామానికి వంతెన నిర్మించాలంటూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.
పాలను అధికంగా ఉత్పత్తి చేయాలి : కలెక్టర్
దళితబంధు పథకం ద్వారా మండలంలో 50 శాతం మంది గేదెల పెంపకం యూనిట్లను ఎంచుకున్నారని, అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసి హైదరాబాద్‌కు తరలించేలా చూడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. అవసరమైతే విజయ డెయిరీని సైతం మండలంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. సీఎం కేసీఆర్ నిజాంసాగర్ మండలాన్ని దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం అదృష్టంగా భావించాలని అన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలవాలని కోరారు.