మెండోరా, మే 1: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 0.6కిలోమీటర్ల దూరంలో కాకతీయ కాలువపై పోచంపాడ్ సోన్‌పేట్ గ్రామాల మధ్య అప్పట్లో ఇనుప వంతెనను నిర్మించారు. వంతెన ఇరుకుగా ఉండడంతో ఏండ్ల తరబడి రెండు గ్రామా ల ప్రజలు రాకపోకల విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విషయాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని కొత్తగా వంతెన నిర్మాణానికి రూ.92.7లక్షలను మంజూరు చేయించారు. పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సోన్‌పేట్ గ్రామస్తులు ప్రతి పనికి పోచంపాడ్ గ్రామానికి రావాల్సిందే. వంతెన ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం కొత్త వంతెనతో తమ కల నెరవేరుతుందని ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
మంత్రికి రుణపడి ఉంటాం..
కాకతీయ కాలువపై రెండు గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం. వంతెన నిర్మాణంతో రెండు గ్రామాల ప్రజల రవాణా కష్టాలు తీరుతాయి.
– మిస్బా, సర్పంచ్, పోచంపాడ్.
రాకపోకలకు తిప్పలు తప్పుతాయి..
కొత్త వంతెన నిర్మాణంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పుతాయి. విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. నిధులు మంజూరు చేయించిన మంత్రికి కృతజ్ఞతలు.
– సంపంగి సతీశ్, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు.