నిజామాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రతి రోజూ సాయంత్రం యువకులు చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. తమ మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్‌లో చూస్తూ అప్పటికప్పుడు తమ స్నేహితులతో కలిసి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన ఈ విష సంస్కృతి చాపకింద నీరులా గ్రామీణ ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తు న్నది. యువత పెద్ద మొత్తంలో అప్పులు చేస్తూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, పిల్లల వ్యవహారశైలిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. డబ్బుల కోసం వారు చోరీలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు బోలెడంత వినోదం ఇస్తున్నాయి. ఆట ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠను రేపుతున్న మ్యాచ్‌లను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే సమయంలో బెట్టింగ్ బాబులు జోరుగా పందేలకు తెరలేపుతున్నారు. ఈ సారి కరోనా పరిస్థితులు అంతగా లేకపోవడంతో బెట్టింగ్‌లో నేరుగా డబ్బులు పెట్టడంతో పాటు ఆన్లైన్ మార్గాలను చాలా మంది యువత ఎంచుకుంటున్నారు. వివిధ చెల్లింపు వ్యాలెట్ల ద్వారా డబ్బులను మార్చుకుంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. నిత్యం ఒక్కో మ్యాచ్‌పై రూ.1000 మొదలు రూ.లక్షల్లో సాగుతున్నది. పోలీసులు గడిచిన 10 రోజుల్లోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 కేసులను నమోదు చేశారు. అయినప్పటికీ కొంత మంది బెట్టింగ్ బంగర్రాజులు పోలీసులకు చిక్క కుండా తమ ఆట ఆడేస్తున్నారు.
కోడ్ భాషతో…
బూకీల వద్ద పందేలు కాసే వారికి కోడ్ భాష వాడుతున్నారు. వారి దగ్గర ఒకసారి రిజిష్టర్ అయిన నంబర్ నుంచి ఫోన్ వస్తేనే మాట్లాడతారు. లెగ్ అనే పదం బెట్టింగ్ రాయుళ్లు వాడే కోడ్ భాష. ఎవరు ఎన్ని లెగ్‌లు తీసుకుంటే అన్నింటికి లెక్కగట్టి మొత్తం చెల్లించాలి. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుపై కాసేందుకు ఫ్లెయింగ్, తక్కువగా ఉన్న జట్టుపై కాసేందుకు ఈటింగ్ అనే పదాలను వాడుతున్నట్లుగా తెలుస్తోంది. మ్యాచ్ జరిగే రోజునే అప్పటికప్పుడు లావాదేవీలు పూర్తవుతాయి. ఐపీఎల్ పోటీలు 20 ఓవర్ల మ్యాచ్ కావడంతో పలు రకాల్లో బెట్టింగ్‌లు పెడుతున్నారు. టాస్ నుంచి మొదలుకొని స్కోర్, జట్టు గెలుపోటములు, స్కోర్ చివరి నంబర్ ఇలా పలు రకాల్లో వంద నుంచి రూ.10వేల వరకు పందెం కాస్తున్నారు. గతంలో పందెం కోసం ప్రత్యేకంగా గదులు, లాడ్జీలను అద్దెకు తీసుకుని అందులో టీవీతో పాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసుకునేవారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లోనే నిర్వహిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న గదుల్లో మకాం వేసి తంతును కొనసాగిస్తున్నారు. నిత్యం రూ.లక్షల్లో చేతులు మారే వ్యవహారంలో దళారులు కీలకంగా ఉంటున్నారు. యువకులు, విద్యార్థులను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. గెలిచిన వ్యక్తికి దళారులు పది శాతం కమిషన్ మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ముట్టజెబుతున్నారు.
వెలుగు చూడనివి ఎన్నో…
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ రెండో వారంలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు బెట్టింగ్ వ్యవహారాలు బయట పడ్డా యి. ఓ ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసు ప్రత్యేక బృందాలు దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. ఏప్రిల్ 10న టూ టౌన్ పరిధిలో, ఏప్రిల్ 14న వన్ టౌన్ పరిధిలో సాగుతోన్న బెట్టింగ్ దందాను టాస్క్‌ఫోర్స్ బృందా లు రట్టు చేశాయి. ఆయా స్టేషన్ల పరిధిలో జరిగిన బెట్టింగ్ వ్యవహారాన్ని ప్రత్యేక బృందాలు తేటతెల్లం చేయడంతో స్థానిక ఠాణా అధికారులు కంగు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వచ్చిన టాస్క్‌ఫోర్స్ బృందాలకు చిక్కిన బెట్టింగ్ రాయుళ్లు స్థానిక పోలీసులకు ఎందుకు చిక్కలేదన్నది అనుమానాలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతున్నట్లుగా నిఘావర్గాలు గుర్తించాయి. పోలీసులు నిఘాను విస్తృతం చేస్తే అమాయకులను ఈ ఊబి నుంచి బయట పడేసే అవకాశం ఏర్పడుతుంది. ఈ రెండు కేసుల్లోనూ యువకులే నిందితులుగా తేలారు. జల్సాలకు అలవాటు పడి, త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశతో వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో గుట్టుగా వ్యవహారం సాగుతున్నది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ జోరుగా బెట్టింగ్ జరుగుతున్నా ఒక్క కేసు నమోదు కాకపోవడం విచిత్రంగా మారింది. రెండేండ్ల క్రితం బెట్టింగ్ కేసుల్లోనే ఎస్సై, సీఐ, డీఎస్పీలు కటకటాలకు వెళ్లినప్పటికీ నిఘా పెంచడంలో పోలీసుల్లో శ్రద్ధ కానరావడం లేదు.
చాపకింద నీరులా వ్యాప్తి…
క్రీడారంగంలో ప్రస్తుతం యువత ఎక్కువగా క్రికెట్‌పై మక్కువ చూపుతున్నది. ఆటలంటే అందరికీ అభిమానమే అయినా క్రికెట్ అంటే చిన్న పిల్లవాడు మొదలు… పెద్దల వరకు మోజు లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఐపీఎల్ పేరిట బెట్టింగ్ జాఢ్యం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. బెట్టింగ్‌కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. మరీ ముఖ్యంగా యువత బెట్టింగ్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నది. కొందరు ఈజీ మనీకి అలవాటు పడి సర్వం కోల్పోతున్నారు. క్రికెట్ ప్రేమికుల వ్యసనాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుని బెట్టింగ్ ముఠాలు విచ్చలవిడిగా పందేలకు పాల్పడుతున్నాయి. ఇందులో సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 2021లో చోటు చేసుకున్నాయి. టాస్ నుంచి మ్యాచ్ ఫలితం వరకు… ప్లేయర్ల వ్యక్తిగత స్కోర్లు, సిక్సర్లు, ఫోర్ల కౌంట్, స్కోర్ ప్రెడిక్షన్ ఇలా బంతి బంతికి వందలు, వేలు, లక్షలు వరకు పందేలు జరుగుతుంటాయి. అయితే ఇదంతా పోలీసులకు తెలియకుండానే జరుగుతుందా అంటే అందులో నిజం లేదు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు తెలిసే బెట్టింగ్ దందా మూడు పువ్వులు… ఆరు కాయలుగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది.
బెట్టింగ్‌లో చిక్కితే భవిష్యత్తు అంధకారమే…
బెట్టింగ్‌లో పట్టుబడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. మా రికార్డుల్లో పేరు, చిరునామా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. బెట్టింగ్ ఆడుతూ లేదా నిర్వహిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవు. యువత సన్మార్గంలో నడవాలి. ఈజీ మనీకి అలవాటు పడి చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తోంది. ఉద్యోగాలు సాధించేలా ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఉద్యోగాలు సంపాదించాలి. ఇలాంటి వ్యవహారాల్లో తల దూర్చవద్దు.
– కేఆర్ నాగరాజు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్