ఎడపల్లి (శక్కర్‌నగర్), ఏప్రిల్ 30: ఎడపల్లి రైల్వేస్టేషన్ పునరుద్ధరణ విషయంపై ఎంపీపీ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అఖిలపక్ష పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు పార్టీలకు చెందిన నాయకులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. నిజాంకాలంలో ఏర్పాటు చేసిన రైలు మార్గం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేదని, ఇటీవల రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ ఎడపల్లి రైల్వేస్టేషన్ మూసివేస్తూ ఉత్తర్వులు జారీచేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడి నుంచి నిత్యం 50 మందికి పైగా ప్రయాణికులు హైదరాబాద్‌కు వెళ్లే వారన్నారు. ప్రస్తుతం ఈ రైల్వేస్టేషన్ మూసివేయడం సరైన నిర్ణయం కాదని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం నిర్వహించిన సమావేశానికి అనుకున్న స్థాయిలో నాయకులు, గ్రామాల వారీగా యువకులు రాకపోవడంతో సమావేశాన్ని మరోమారు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుత సమావేశానికి హాజరైన వారు ఎంపీ అర్వింద్, రైల్వేశాఖ అధికారులకు సమస్యపై నివేదించాలని తీర్మానించారు. అనంతరం, మరోమారు సమావేశం నిర్వహించి రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఎడపల్లి ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, సింగిల్‌విండో అధ్యక్షుడు పోల మల్కారెడ్డి, ఎడపల్లి ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ వాహబ్ భారీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆత్మెల శ్రీనివాస్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు గుమ్ముల గంగాధర్, బీజేపీ నాయకులు మల్లెపూల శ్రీనివాస్, నాయిని సతీశ్ గౌడ్, దయానంద్ గౌడ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.