వేల్పూర్, ఏప్రిల్ 30: మహిళా సంక్షేమంతోపాటు వారు ఆర్థికంగా వృద్ధి సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం డీఆర్డీవో చందర్ నాయక్, నియోజకవర్గ స్థాయి సిబ్బందితో ఐకేపీ పథకాలపై మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…మండల సమాఖ్య ద్వారా కస్టమర్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, వరి కోత యంత్రం, పసుపు ఉడకబెట్టే మిషన్ వంటి యంత్రాలను మండల సమాఖ్య ద్వారా కొనుగోలు చేసి రైతులకు తక్కువ ధరకే అద్దెకి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఐకేపీ ద్వారా అందించే బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్నిరూ.800కోట్ల నుంచి వెయ్యి కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని, ఒక్కో మహిళా సంఘానికి పది లక్షల నుంచి రూ.20లక్షలు వరకు రుణం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. బ్యాంకు లింకేజీ కింద తీసుకున్న రుణాల ద్వారా మహిళలు నూతన వ్యాపారాలు ఏర్పాటు చేసేలా చూడాలని మంత్రి ఐకేపీ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో 806 గ్రామ మహిళా సమాఖ్యలు ఉండగా, ఒక్కో గ్రామ సమాఖ్యలో ఐదు నుంచి పది మంది మహిళలు కొత్త వ్యాపారం ఏర్పాటు చేసేలా చూడాలని,వారికి రెండు లక్షల చొప్పున వ్యక్తిగత రుణం అందించాలని సూచించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 6200 యూనిట్లు కొత్తగా ఏర్పాటు చేసేందుకు ఐకేపీ సిబ్బంది కృషి చేయాలని కోరారు.
ఆహారశుద్ధి పరిశ్రమలో భాగంగా రూ.20లక్షల వరకు బ్యాంకు రుణం అందింవచ్చని దీనికి 35శాతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సబ్సిడీ ఉంటుందన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పించేందుకు భారీ జాబ్‌మేళా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని, జిల్లాలో మహిళా సంఘాల పనితీరు బాగుందని మంత్రి అభినందించారు. సమావేశంలో డీఆర్డీవో చందర్ నాయక్, ఏపీడీ మధుసూదన్, డీపీఎం నూకల శ్రీనివాస్, ఏపీఎంలు కుంట గంగారెడ్డి, కిరణ్, ప్రమీల, పుప్పాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.