నిజామాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియాలో జల సిరులు పరుగులు పెట్టనున్నాయి. బీడు భూములు పచ్చదనం సంతరించుకోనున్నాయి. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సంకల్పంతో బాన్సువాడ నియోజకవర్గం ఇరిగేషన్ సర్క్యూట్‌గా మారనుంది. ఎత్తిపోతల పథకాలతో నియోజకవర్గ వ్యాప్తంగా సాగు నీటి సౌకర్యం మెరుగవ్వనుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో చెరువులను బాగు చేసుకున్న తర్వాత పరిస్థితులు మెరుగయ్యాయి. భూగర్భ జలాలు పెరిగి, కాలువల ద్వారా నీళ్లు రావడంతో పడావు భూములు సైతం సాగులోకి వచ్చాయి. అయితే, స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న చందూర్, మోస్రా, వర్ని మండలాల్లోని నిజాంసాగర్ కెనాల్ కుడి వైపు గల నాన్ కమాండ్ ఏరియా ప్రాంతంలో ఎండాకాలం దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి.
భౌగోళిక సమస్య కారణంగా నీటి తరలింపు క్లిష్టంగా మారింది. పక్క నుంచే నిజాంసాగర్ జలాలు పారుతున్నప్పటికీ, ఆయా ప్రాంతాల్లోని భూములకు నీరందించడం కష్టంగా మారింది. రైతుల నీటి గోసను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు స్పీకర్ పోచారం చొరవ చూపారు. స్వయంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియాలో దాదాపుగా 8 వేల ఎకరాలకు నీళ్లు అందించే ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు. రూ.106.04 కోట్ల వ్యయంతో చేపట్టనున్న జాకోరా, చందూర్ – చింతకుంట ఎత్తిపోతల పథకాల ద్వారా 7,975 ఎకరాలకు ప్రయోజనం కలుగనుంది. రూ.69.52 కోట్లతో నిర్మించనున్న జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు నేడు (శుక్రవారం) తొలి అడుగు పడనుంది.
చెరువులను నింపేలా…
చందూర్-చింతకుంట ఎత్తిపోతల పథకం ద్వారా 3,505 ఎకరాలకు నీటి వసతి కల్పించాలని సంకల్పించారు. రూ.36.52 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ లిఫ్ట్ ద్వారా చందూర్, మోస్రా మండలాల్లోని కారేగావ్-లింగాపూర్, లక్ష్మాపూర్, మేడిపల్లి(మేడిపల్లి తండా, లక్ష్మీసాగర్ తండా, నడిమి తండా, మడ్గల్ తం డా), చందూర్, తిమ్మాపూర్, చింతకుంట గ్రా మాలకు సాగు నీటి వసతి సమకూరనుంది. నాన్ కమాండ్ ఏరియాకు నీళ్లు తీసుకురావడంతో పాటే భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే చుట్టు పక్కల గ్రామాల్లోని చెరువులను నింపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చందూర్-చింతకుంట ఎత్తిపోతల ద్వారా 10 గ్రామాలకు చెందిన చెరువులు, కుంటలకు భవిష్యత్తులో నీళ్లను తరలించేందుకు వీలుగా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఫలితంగా 2,255 ఎకరాలకు ఈ ఎత్తిపోతల పథకం ఆయువుపట్టుగా మారనుంది. ఇక జాకోరా ఎత్తిపోతల ద్వారా కూడా స్థానికంగా 11 చిన్నపాటి చెరువులు, కుంటలను నింపేలా ప్రణాళికలు రూపొందించారు. తద్వారా 1,567 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో వర్షాకాలంలోనే ఈ చెరువుల్లోకి పుష్కలంగా నీళ్లు చేరుతాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడితే నూతనంగా నిర్మించనున్న ఎత్తిపోతల పథకాలు ఆయా చెరువులకు ఉపయుక్తంగా మారనున్నాయి.
ఎత్తిపోతల ప్రణాళిక ఇదీ..
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, చందూర్, మోస్రా మండలాల్లో 23,940 ఎకరాల సాగు భూములున్నాయి. ఇందులో 13,377 ఎకరాలకు నిజాంసాగర్ కెనాల్ ద్వారా నీళ్లు అందుతున్నాయి. అలాగే, 4,736 ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ (చెరువుల) ద్వారా అందుతోంది. మిగిలిన 5,827 ఎకరాల సాగు భూములకు నీటి ఆధారం లేక నాన్ కమాండ్ ఏరియాగా గుర్తించారు. ఆయా భూముల్లో వర్షాధార పంటలు తప్ప యాసంగిలో పంటలు పండించడానికి నీటి వసతి కరువైంది. ఎలాగైనా ఈ ప్రాంత రైతులకు సాగు నీరు అందివ్వాలని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సంకల్పించారు. జల వనరుల శాఖ ద్వారా సమగ్ర అధ్యయనం చేయించి ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. రూ.106.04 కోట్ల వ్యయంతో 7,975 ఎకరాలకు సాగు నీరందించే జాకోరా, చందూర్-చింతకుంట ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. దీంతో నాన్ కమాండ్ ఏరియాలోని రైతుల కష్టాలు తొలగి పోనున్నాయి. జాకోరా ఎత్తిపోల పథకం ద్వారా వర్ని మండలంలోని 9 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. మల్లారం, పొట్టిగుట్ట తండా, వర్ని, జాకోరా, కూనిపూర్, జలాల్పూర్, సయీద్పూర్, రాజ్పేట్, సంకోర గ్రామాల పరిధిలోని 4,470 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ఎత్తిపోతల పథకానికి రూ.69.52 కోట్లు వెచ్చించనున్నారు.
చకచకా సిద్ధాపూర్ రిజర్వాయర్..
బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద రిజర్వాయర్ నిర్మాణంతో పాటు కాలువల ఆధునీకరణ పనులకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి 11న శంకుస్థాపన చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా 10 వేల ఎకరాలకు సాగు నీటి వసతి లభించనుంది. సిద్ధాపూర్ రిజర్వాయర్ పరిధిలోని ఆయకట్టు కింద ఇప్పటి వరకు 614 ఎకరాలు మాత్రమే ఉంది. అయితే, చద్మల్, పైడిమల్, నామ్కల్ చెరువులను కలిపి, రిజర్వాయర్‌గా మార్చడంతో భారీగా ఆయకట్టు సామర్థ్యం పెరుగనుంది. దట్టమైన అటవీ ప్రాంతంలోని పొలాలకు సైతం సాగు నీరు చేరనుంది. తద్వారా గాంధారి, బాన్సువాడ, నస్రుల్లాబాద్, వర్ని మండలాలకు మేలు జరుగనుంది. సిద్ధాపూర్ రిజర్వాయర్ ఆనకట్ట దాదాపుగా 3.6 కిలో మీటర్ల మేర నిర్మించబోతున్నారు. ఈ మూడు చెరువుల ఉన్నతీకరణతో పాటు కాలువల ద్వారా సాగు నీటి సరఫరా కోసం ప్రభుత్వం రూ.119 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.72.52 కోట్లను వెచ్చించనున్నారు. మరో రూ.46.89 కోట్లతో గ్రావిటీ ద్వారా నీరందించేలా కాలువలు నిర్మించనున్నారు. రిజర్వాయర్‌తో పాటు సాగు నీళ్లను పొలాలకు చేర్చే కాలువల నిర్మాణ పనులను ఏకకాలంలోనే చేపట్టనున్నారు.
నర్సింగ్ కాలేజీకి శాశ్వత భవనం..
రాష్ట్రంలో గతేడాది మూడు నర్సింగ్ కాలేజీలు మంజూరయ్యాయి. ఇందులో ఒకటి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నెలకొల్పారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. నర్సింగ్ కాలేజీని ప్రస్తుతం బాన్సువాడలోని 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో కొనసాగిస్తున్నారు. ఈ కాలేజీకి శాశ్వత భవనం కోసం స్పీకర్ పోచారం చొరవ తీసుకుని రూ.40 కోట్లు మంజూరు చేయించారు. అలాగే, నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులో 5 ఎకరాల భూమిని కాలేజీ కోసం కేటాయించారు. శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ కాలేజీ నిర్మాణం జరగడం మూలంగా నాణ్యమైన నర్సింగ్ విద్యా బోధనకు ఆస్కారం ఏర్పడనుంది. సువిశాల ప్రాంతంలో నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు.