బీర్కూర్, ఏప్రిల్ 28: అడవిలో తిరిగే పక్షులు వాలేందుకు, జంతువులు నీడలో సేదతీరేందుకు చెట్లు ఎంత అవసరమో, చదువుకునే యువకులకు, నిరుద్యోగులకు వసతులు, సౌకర్యాలు అంతే అవసరం. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులుపడే యువకులు, నిరుద్యోగులు కోకొల్లలు. ఇలాంటి పరిస్థితే కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన కొంత మంది యువకులకు ఎదురైంది. మండల కేంద్రంలోని పాతబోయి సంఘం వారికి ఆసరాగా మారింది. ఏండ్లక్రితం ఈ సంఘ భవనాన్ని పెంకుటిల్లుతో నిర్మించారు. కేవలం చదువులకే కాకుండా యువకులు, వృద్ధులు సైతం సేదతీరేందుకు ఇక్కడ అవకాశముంటుంది. ఈ సంఘం ప్రస్తుతం నిరుద్యోగులకు అడ్డాగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇండ్లలో ఉంటే కేవలం చదువుకోవడమే జరుగుతుందని, అదే ఇక్కడైతే చదువుతోపాటు తోటివారితో మాట్లాడుతుంటే జనరల్ నాలెడ్జ్ బుర్రకెక్కుతుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. చదువుకు ఎలాంటి భంగం కలగకుండా పరిస్థితులు అనుకూలంగా ఉండేందుకే ఇక్కడి తామంతా వచ్చి చదువుకుంటున్నామని నిరుద్యోగ యువకులు తెలియజేయడం వారి పట్టుదలకు నిదర్శనం. ఇండ్లల్లో అయితే పేద కుటుంబాలైనందున తమ కుటుంబ సభ్యులు చెప్పే పనులతో కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని. పొలాలకు, పశువులు తదితర ప్రదేశాలకు వెళ్లి సమయాన్ని వృథా చేసుకోలేమంటున్నారు నిరుద్యోగ యువకులు. ప్రతి రోజూ మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చదువుకుంటామని, మధ్యలో ఒక గంట భోజన సమయానికి కేటాయిస్తామని తెలుపుతున్నారు.
గ్రూప్-2 లో ఉద్యోగం సాధిస్తా..
నేను డిగ్రీ పూర్తి చేశాను. తప్పకుండా ఈ సారి గ్రూప్-2లో ఉద్యోగం సాధిస్తాను. ప్రభుత్వం 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. పట్టుదలతో చదువుకొని ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నాను. ఈ పాతబోయి సంఘం తమకు కన్నతల్లిలా ఎంతో చల్లగా ఉంది. అందుకే తామంతా ఒక్కచోటికి చేరి చదువుకుంటాం.
– దొమ్మటి విద్యాసాగర్, నిరుద్యోగి, బీర్కూర్
ఎస్సై అవుతా..
నేను డిగ్రీ చదువుకున్నాను. ఈసారి ఎలాగైనా ఎస్సై జాబ్ సాధించాలనే కసితో ఉన్నాను. కచ్చితంగా ఎస్సైని అవుతా. మా ఇల్లు చిన్నగా ఉన్నది. ఇంటి దగ్గర పిల్లలు నా చదువుకు భంగం కలిగిస్తారని ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను.
-నెల్లూరి గోపాల్, నిరుద్యోగి, బీర్కూర్