ఆర్మూర్, ఫిబ్రవరి 16: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి గురువారం నిజామాబాద్ నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద భారీ స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి భారీ వాహన ర్యాలీతో జీవన్‌రెడ్డి నిజామాబాద్‌లోని కలెక్టర్ మైదానానికి చేరుకుంటారు. ఓపెన్ టాప్ జీపులో ఆయన డిచ్పల్లి మీదుగా నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో జీవన్‌రెడ్డి పాల్గొననున్నారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకం అయిన అనంతరం జీవన్‌రెడ్డి తొలిసారిగా సీఎం వేడుకల్లో పాల్గొననున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా 68 కిలోల కేక్‌ను కట్ చేసేందుకు సిద్ధం చేశారు. సంబురాలకు ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. వేడుకల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్, బోధన్ ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, షకీల్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రౌండ్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ శ్రేణులకు మాంస, శాఖహార భోజనాలకు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు.