బాల్కొండ, ఏప్రిల్ 28: ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఆయన పీహెచ్సీలు, యూపీహెచ్సీల పరిధిలోని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఆరోగ్యం విషయంలో తగిన సూచనలు, సలహాలు అందజేయాలన్నారు. సమావేశంలో ఈవో నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య ఉప కేంద్రాల పరిశీలన..
ఆర్మూర్, ఏప్రిల్ 28: మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సమత మండలంలోని పలు ఆరోగ్య ఉప కేంద్రాలను గురువారం పరిశీలించారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు జాతీయ కార్యక్రమాలను ఆన్లైన్లో వందశాతం పూర్తి చేయాలని స్థానిక వైద్య సిబ్బందికి సూచించారు. రికార్డులన్నీ పరిశీలించి అసంపూర్తిగా ఉన్న వాటిని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో హెచ్ఈవోలు కాంతయ్య, రవి, సిబ్బంది స్వరూప, సుగుణ, ఆరోగ్య పర్యవేక్షకులు సుభాష్, రవి, అనవాల, అజీమ తదితరులు పాల్గొన్నారు.