నిజామాబాద్, ఏప్రిల్ 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):నిరుద్యోగులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామక ప్రకటన వచ్చేసింది. పోలీసు శాఖ నుంచి తొలి నోటిఫికేషన్ జారీ అయింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన మేరకు ఏకంగా 16,614 పోస్టులతో కూడిన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సోమవారం నియామక ప్రకటన విడుదల చేసింది. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు, వాటికి అనుగుణంగా ఆర్థిక శాఖ అనుమతుల జారీ ప్రక్రియ ఇప్పటికే చకచకా పూర్తవుతోంది. ఇందులో భాగంగా పోలీస్ నియామక బోర్డు సైతం తీవ్ర స్థాయిలో కసరత్తు చేసి, తాజాగా ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. జంబో ప్రకటనతో వేలాది మందికి ప్రభుత్వ కొలువులు దక్కబోతున్నాయి. అందులో యూనిఫార్మ్ సర్వీసు ఉద్యోగాలు కావడంతో చాలా మంది యువతీ, యువకులు ఈ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు తహతహలాడుతున్నారు. గత నెలలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై చేసిన ప్రకటనతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని నిరుద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది. ఉద్యోగాల కోసం వేలాది మంది పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సమయం తెల్వకుండా విషయ పరిజ్ఞానాన్ని అవసోపన పడుతున్నారు.
ఔత్సాహికులకు టీఆర్ఎస్ అండ..
కొలువుల కోసం శ్రమిస్తోన్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోంది. ఉద్యోగాలను సంపాదించాలంటే సామాజిక, ఆర్థిక, భౌగోళిక, చరిత్ర విభాగాల్లో పట్టు ఉండాలి. విషయ నైపుణ్యం సాధించాలంటే ఇప్పటికిప్పుడు కోచింగ్ సెంటర్లను వెతుక్కోవడం గ్రామీణ ప్రాంత యువతకు చాలా కష్టం. మరోవైపు, ఒకేసారి 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ కానున్న నేపథ్యంలో అన్ని కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. సగటు పేద విద్యార్థులకు శిక్షణ కష్టంగా మారింది. ఈ ఇబ్బందిని దూరం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తమ సొంత ఖర్చుతో కోచింగ్ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలోనూ సుమారు వేయి మందికి ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేశారు. పైసా ఖర్చు లేకుండానే కోచింగ్ ఏర్పాట్లు అందుబాటులోకి రావడం ద్వారా నిరుద్యోగులకు ఎంతో భరోసా లభిస్తోంది. పోలీస్ కొలువులకు జారీ చేసిన నోటిఫికేషన్లో దరఖాస్తుల స్వీకరణ మే 2 నుంచి ప్రారంభం కానుంది. మే 20 చివరి తేదీగా నియామక బోర్డు స్పష్టం చేసింది. దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరించనున్నారు. పూర్తి స్థాయి అర్హతలకు సంబంధించిన వివరాలను www.tslprb.in వెబ్సైట్లో చూసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
16 వేలకు పైగా..
చాలా మందికి యూనిఫాం సర్వీసుల్లో చేరాలని కల ఉంటుంది. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎస్సై, కానిస్టేబుల్ విభాగాల్లో వేలాది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించడంతో ఔత్సాహిక యువతీ, యువకులకు జీవితంలో సెటిల్ కావడానికి ఇదో మంచి అవకాశంగా మారనున్నది. ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడాలని బలంగా కోరుకునే వారికి ఆయా కేటగిరీల్లోని ఉద్యోగాలు ఉపయుక్తం కానున్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తంగా 16,614 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. కానిస్టేబుల్ పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో పెద్ద ఎత్తున సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీస్ నియామక బోర్డు ప్రకటన జారీ చేసింది. 16,027 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అలాగే, 587 ఎస్సై పోస్టులు సైతం భర్తీ చేయనున్నారు. ఇందులో 414 సివిల్, 66 ఏఆర్, 5 రిజర్వ్, 23 టీఎస్ఎస్పీ, 12 ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. విపత్తు, అగ్నిమాపక శాఖలోనూ 26 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమంత్రి సారు మాట నిలుపుకున్నారు
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సారు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాలకు ప్రకటన రావడం ఆనందంగా ఉంది. ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో కష్టపడి చదువుతున్న.
– రిక్క మహేందర్, అంక్సాపూర్
చాలా సంతోషంగా ఉంది..
సీఏం కేసీఆర్ చెప్పినట్లుగానే నియామక ప్రకటన ఇవ్వడం చాలా అనందంగా ఉంది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూశాం. ఉద్యోగ ప్రకటన రావడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. బాగా కష్టపడి ఉద్యోగం సాధిస్తా.
– జుబేర్, బాన్సువాడ
కేసీఆర్ సారుకు ధన్యవాదాలు..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నిధులు, నియామకాలు, నీళ్లు అన్న నినాదంతోనే సాగింది. సబ్బండ వర్ణాలతో కలిసి ఉద్యమించి తెలంగాణను సాధించిన సీఎం కేసీఆర్ సారు.. కాళేశ్వరం ద్వారా సాగునీటి సమస్యను తీర్చారు. నియామకాల విషయంలో అన్ని ఉద్యోగాలకు స్థానికులకే అవకాశం కల్పించారు. ప్రస్తుతం నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని ఖాళీల భర్తీకి నడుం బిగించారు. సీఎం సారుకు ధన్యవాదాలు.
– లక్ష్మి, సంగోజీపేట్
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం
నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా ఉద్యోగ ప్రకటన జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉం టాం. పాత జోనల్ వ్యవస్థతో స్థానికులకు అన్యాయం జరిగింది. జోనల్ వ్యవస్థను మార్పు చేయడం వలన నిరుద్యోగులకు న్యాయం జరగనున్నది. ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా.
– ప్రసన్న, వేల్పూర్
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటాం
మాది పేద కుటుంబం. శిక్షణ కోసం డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. మాలాంటి వారి కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి అండగా నిలబడ్డారు. తన సొంత ఖర్చులతో ఏర్పా టు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసు కుంటాం. కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తా.
– సంటి వీణ, వేల్పూర్