నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 25 : కాదేదీ చోరీకి అనర్హం అన్న రీతిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా దొంగతనాలకు పాల్ప డుతున్న ముఠా ఉమ్మడి జిల్లాలో సంచరిస్తున్నది. ముఠా టార్గెట్ సైలెన్సర్లే.. అవును మీరు చదివింది నిజమే.. సైలెన్సర్లను ఎత్తుకుపోతున్న ముఠా సంచరిస్తున్నది. చోరీ చేసిన సైలెన్సర్లను ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. నెల రోజులుగా ఈ గ్యాంగ్ దొంగతనాలు చేస్తున్నప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నది. కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే కారు సైలెన్సర్లను తస్కరిస్తున్నారు. మారుతీ కంపెనీకి చెం దిన (లేటెస్ట్ మోడల్) ఈకో (బీఎస్-6)వాహన సైలెన్సర్లనే ఈ ముఠా దొంగలిస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సంచరిస్తూ ఫంక్షన్ హాళ్లు, ఇండ్ల ముందు, మార్కెట్ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన వాహనాలను టార్గెట్ చేస్తున్నారు. ఈ వ్యాన్‌కు ఉండే (పొల్యూషన్ కంట్రోల్ చేసే మోడల్)క్యాట్లిక్ కన్వర్టర్ సైలెన్సర్లను దొంగిలించుకుపోతున్నారు. సుమారు ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉండే ఈ గ్యాంగ్ ఎక్కడైన నిలిపి ఉంచిన వ్యాన్ల సైలెన్సర్‌ను కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎత్తుకెళ్తున్నారు. అలా దొంగిలించిన సైలెన్సర్లను అహ్మదాబాద్, సూరత్ వంటి ప్రాంతాల్లో విక్రయిస్తు డబ్బులు గడిస్తున్నారు.
ఈకో వాహన సైలెన్సర్లే ఎందుకు..?
ఈ వాహన సైలెన్సర్ ధర రూ.75వేల నుంచి రూ.80 వేల వరకు ఉంటుంది. వాహనం నుంచి తొలగించడానికి సులువుగా ఉండడంతో ఈ ముఠా సభ్యులు వాటిని టార్గెట్ చేశారు. వాహనం నుంచి వెలువడే పొగను శుద్ధి చేసే క్రమంలో సైలెన్సర్ గొట్టంలో మెటల్ డస్ట్ ఏర్పడుతుంది. ఇందు లో ముఖ్యంగా పల్లాడియం, ప్లాటినం, రోడియం ఉంటాయి. రోడియం, పల్లాడియం 10 గ్రాముల ధర రూ.3 వేల నుంచి రూ.6వేల వరకు పలుకుతున్నది. పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ఉపయోగించే ఖరీదైన లోహపు డస్ట్‌ను వెలికితీసి విక్రయిస్తుంటారు. సైలెన్సర్‌కు ఉండే ఆక్సిజన్ సెన్సార్ విలువ సైతం రూ. 15 వేలు వరకు ఉంటుంది. దీంతో దొంగల ముఠా సైలెన్సర్లను టార్గెట్ చేసింది.
వెలుగు చూస్తున్న చోరీలు
జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఇలాంటి చోరీలు వెలుగు చూశాయి. తమ వాహనం సైలెన్సర్ దొంగతనం జరిగిందని మరో సైలెన్సర్ కావాలంటూ ఒక బాధితుడు షోరూం వారిని ఆశ్రయించగా, మరో బాధితుడు కారు గ్యారేజీలో సంప్రదించాడు. నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్‌దేవ్ వాడ ఏరియాలో ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన మారుతీ ఈకో వ్యాన్ సైలెన్సర్ నాలుగు రోజుల క్రితం చోరీకి గురైంది. అంతే గాకుండా కామారెడ్డి జిల్లా నుంచి ఓ వ్యక్తి శుభకార్యం ఉందని తన స్నేహితుని వద్ద నుంచి మారుతి ఈకో వ్యాన్ అడిగి తీసుకున్నాడు.అనంతరం ఆ వ్యాన్‌లో అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గాం(పీ) గ్రామంలోని శుభకార్యానికి వచ్చాడు. అక్కడ వ్యాన్ నిలిపి వెళ్లిన అతడు తిరిగి వచ్చి చూడగా సైలెన్సర్ దొంగతనం జరిగినట్లు గుర్తించాడు.
కస్టమర్లను అప్రమత్తం చేస్తున్న షోరూమ్ నిర్వాహకులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీ షో రూం నుంచి ఈకో వాహనాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు ఫోన్లు చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. నగరంలోని వినాయక నగర్ 100 ఫీట్స్ రోడ్డులో నివాసం ఉండే అరిబండి అజిత్ కుమార్ అనే వ్యక్తి కి ఈ నెల 12వ తేదీన మారుతి వరుణ్ మోటర్స్ షో రూం వారు ఫోన్ చేశారు. సార్ మీరు ఈకో వెహికిల్ తీసుకున్నారు కదా.. ఆ మోడల్ వెహికిల్ సైలెన్సర్లు ఎత్తుకు పోతున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ అప్రమత్తం చేశారు. ఇలాంటి కొత్తతరహా దొంగతనాలకు పాల్పడే ముఠాను పోలీసులు గుర్తించి వీలైనంత త్వరగా పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు.