వేల్పూర్, ఏప్రిల్ 25: రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నదని, ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సుమారు 57 రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేక యాప్‌ను సైతం రూపొందించినట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బాల్కొండ నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసం తన సొంత ఖర్చుతో మండలంలోని హనుమాన్ నగర్(వడ్డెర కాలనీ)లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సుమారు వెయ్యి మం ది యువతీ యువకులకు పోలీస్ ఉద్యోగాల కోసం జిల్లా కేంద్రంలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమైనట్లు తెలిపారు. తాజాగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బా ల్కొండ నియోజకవర్గానికి చెందిన ఉద్యోగార్థుల కోసం సొంత ఖర్చుతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. ఉచిత శిక్షణ కోసం నిర్వహించిన స్క్రీ నింగ్ టెస్టుకు 850 మంది హాజరుకాగా, వారిలో మెరి ట్ ఆధారంగా 461 మందిని ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు.
నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలని..
జిల్లాలోని నిరుపేద కుటుంబాలకు చెందిన యువతకు న్యాయం జరగాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో అందించే కోచింగ్‌కు ఏమాత్రం తగ్గకుండా మరింత మెరుగైన మెటీరియల్‌తో నిష్ణాతులైన ఫ్యాకల్టీతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించామన్నారు. అంకితభావం, పట్టుదల, ఏకాగ్రతతో చదువుతూ ఉచిత శిక్షణ తరగతులను కొలువుల సాధనకు అనుకూలంగా మలుచుకోవాలని ఉద్యోగార్థులకు సూచించారు. జిల్లాలో బాల్కొం డ నియోజకవర్గం నుంచి అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే తనకు చెప్పలేనంత సంతృప్తి కలుగుతుందన్నారు. తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినట్లు అవుతుందన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. నీళ్లు, నియామకాలను కొల్లగొట్టిన వలస పాలకులు తెలంగాణను దుర్భర స్థితిలోకి నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సమకూరిన ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతం అభివృద్ధికి వినియోగించారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లోనూ తెలంగాణ యువతకు హైదరాబాద్ ఫ్రీజోన్ వంటి జీవోలను తెరపైకి తెచ్చి అమలు చేసిన కారణంగా తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీనిని గమనించిన కేసీఆర్ మలి విడుత తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో గడిచిన ఏడేండ్ల కాలంలోనే లక్షా31వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వివరించారు.
తాజాగా 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ నోటిఫికేషన్లను విడుదల చేయిస్తున్నారని అన్నారు. కేవలం ఉద్యోగాల భర్తీయే కాకుండా అవి స్థానికులకే దక్కాలనే తపనతో ఏడాదిన్నరగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారన్నారు. కొలువుల భర్తీలో స్థానికత అమలు కోసం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేయించారన్నారు. దీంతో ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో 95శాతం స్థానికులకే దక్కనున్నాయని చెప్పారు. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, ఎంవీఐ సుభాష్, మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, డాక్టర్ మధుశేఖర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోటపాటి నరసింహనాయుడు ఉద్యోగ సాధనలో తమ అనుభవాలను వివరించి ఉద్యోగార్థుల్లో స్ఫూర్తిని నింపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.