నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 20: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని కేసీఆర్.. తన భుజాన వేసుకొని ముందుకు నడిపించారని, ఆయన పోరాట ఫలితంగానే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే ఎక్కడా లేని అభివృద్ధిని సాధిస్తున్నదని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని కొనియాడారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో, సీపీ నాగరాజు పర్యవేక్షణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై ఎమ్మెల్సీ రాజేశ్వర్, కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ నాగరాజుతో కలిసి ప్రారంభించారు. అనంతరం అభ్యర్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.
ఏడేండ్ల పాలనలో సీఎం కేసీఆర్.. మనకు రావాల్సిన నీళ్లను తెచ్చి, ప్రాజెక్టులను కట్టి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారని గుర్తుచేశారు. నిధుల విషయంలో రాష్ట్ర ఆదాయాన్ని నాలుగింతలు పెంచి అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందజేయడంతోపాటు అభివృద్ధిలో తెలంగాణను నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టారని అన్నారు. ఇప్పటికే లక్షా 30వేల మందికి ఉద్యోగాలు కల్పించారని, మరో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు వేయనున్నట్లు వివరించారు. రాష్ట్రపతి ఆర్డర్‌ను మార్పించి 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా సీఎం కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు 1,976 ఉద్యోగాలు దక్కనున్నాయని, వీటితోపాటు 2,300 జోనల్ పోస్టులు, 6వేల మల్టీజోనల్ పోస్టులు రానున్నాయని మంత్రి వెల్లడించారు. పేద కుటుంబాలు, భారీగా డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకునే అవకాశంలేని వారి కోసం కలెక్టర్, సీపీతో చర్చించి పలువురి సహకారంతో ఉచిత శిక్షణ ఇప్పిచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. దీంతోపాటు 57 వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ఆన్లైన్ క్లాసులతో కూడిన ప్రత్యేక యాప్‌ను రూపొందించి అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. అభ్యర్థులకు వసతిని కల్పించేందుకు సహకరిస్తున్న ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత మారయ్య గౌడ్‌ను అభినందించారు. మెరిట్ టెస్ట్ నిర్వహణకు శ్రమించిన పోలీస్ శాఖ ఐటీ విభాగం సిబ్బందికి మంత్రి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, డీసీపీ వినీత్, అదనపు డీసీపీలు ఉషా విశ్వనాథ్, అరవింద్‌బాబు, నరేందర్‌రెడ్డి, గిరిరాజ్, ఏసీపీ వెంకటేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.