భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే ప్రతాపం చూపుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
పది గంటల తర్వాత రోడ్లన్నీ ఖాళీ
అత్యవసరమైతేనే గడప దాటేది
పొద్దంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం
గిర్రున తిరుగుతున్న మీటర్లు
ఉష్ణోగ్రత 45 డిగ్రీలుదాటే అవకాశంఖలీల్వాడి ఏప్రిల్ 19:భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచే ప్రతాపం చూపుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమి తాళలేక జనం గడప దాటేందుకు భయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప అడుగు బయట పెట్టడం లేదు. దీంతో పది, పదకొండు గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మంగళవారం 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండాకాలంలో సూర్యుడికి భూమి దగ్గర రావడంతో సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెలలో 45 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మే మాసంలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
రాత్రి వేళా తగ్గని భగభగలు..
ఉదయం నుంచే ఎండ దంచికొడుతుండడంతో ప్రజలు ఉడికి పోతున్నారు. రాత్రి తొమ్మిది దాటినా వేడిమి, ఉక్కపోత తగ్గడం లేదు. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల కిందకు దిగి రావడం లేదు. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య 18 డిగ్రీల కంటే ఎక్కువ వ్యత్యాసం పెరిగితే ప్రజలు జ్వరాల బారిన పడతారని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గత నెలలో ప్రారంభమైన ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగుతోంది. వాతావరణ మార్పులతో ఇటీవల కొద్దిగా చల్లబడినా, మళ్లీ ఎండ పెరిగింది.
ఎండలు, వడగాలుల దాటికి ప్రజలు రోడ్లు పైకి రావాలంటేనే భయపడుతున్నారు. జనమంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఒక్క నిమిషం కరెం టు పోయినా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యా హ్నం వేళ జనసంచారం లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పని మీద బయటికి వచ్చే వారు టోపీలు పెట్టుకుని, స్కార్ప్‌లు కట్టుకొని గడప దాటుతున్నారు. ఉదయం 11 గంటల్లోపే పనులు పూర్తి చేసుకునేలా చూసుకుంటున్నారు.
కపోతే సాయంత్రం 6 తర్వాత మిగిలిన పనులు చేసుకోవడానికి బయటికి వస్తున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటయ్యాయి. మరోవైపు, మార్కెట్లో ఏసీలు, కూలర్లకు, ఫ్యాన్లలకు భలే గిరాకీ ఏర్పడింది. అదే సమయంలో శీతల పానీయాలకు డిమాండ్ పెరిగింది. పండ్లు, ఫలాలకు, జ్యూస్‌లకు, శుద్ధ జలానికి ప్రజలు ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఎండ పెరిగితే ఆరోగ్యశాఖ కూడా ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఎండల తీవ్రత దృష్ట్యా మార్కెట్లో కొబ్బరి బొండాలు విరివిగా అమ్ముడు పోతున్నాయి. డిమాండ్ పెరగడంతో వాటి ధరకు రెక్కలొచ్చాయి. ఒక్కో బొండానికి రూ.50 చొప్పున తీసుకుంటున్నారు.