నవీపేట, ఏప్రిల్ 17 :ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వారి భవిష్యత్తు బాగుంటున్నదన్న తల్లిదండ్రుల కలలు నెరవేరే రోజులు రానున్నాయి. మన ఊరు – మనబడి పేరుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తుండడంతో నిజామాబాద్ జిల్లా నవీపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరుగనున్నది.
నవీపేటలో 1957 సంవత్సరం కొద్ది మంది విద్యార్థులతో సర్కారు బడి మొదలైంది. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం టీచర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలుగా పనిచేసి రిటైర్ కాగా, మరికొందరు రాజకీయ, వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పాఠశాలలో తెలుగు మీడియంలో 500 మంది విద్యార్థులు చదివేవారు. కార్పొరేట్ పాఠశాలల ఏర్పాటు, ఇంగ్లిష్ మీడియంలో చదువులు ప్రారంభం కావడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో బోధనకు శ్రీకారం చుట్టడంతో నవీపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అమాంతం పెరగనున్నది. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం 317 విద్యార్థులు విద్యను అభ్యసించగా 172 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు.
మారనున్న పాఠశాల రూపురేఖలు…
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ప్రారంభించనున్న నేపథ్యంలో నవీపేట ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారనున్నాయి. పూర్వ విద్యార్థులు సైతం పాఠశాల అభివృద్ధికి కంకణం కట్టుకుంటున్నారు. ఇప్పటికే విద్యార్థులకు సరిపడా నూతన గదుల నిర్మాణం ఉండగా పూర్వ విద్యార్థులు సరస్వతీ మాత విగ్రహంతోపాటు షెడ్డు నిర్మాణాన్ని చేపట్టి ఇచ్చారు. పూర్వ విద్యార్థి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మామ ఆర్.రాంకిషన్రావు విద్యార్థులకు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి నిధులు అందజేశారు. మరో పూర్వ విద్యార్థి ప్రముఖ వ్యాపార వేత్త బీడీ దాస్ పాఠశాలకు బోరుమోటరును విరాళంగా ఇచ్చారు. దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో నవీపేట ప్రభుత్వ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతున్నది.
పేద విద్యార్థులకు వరం..
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించనుండడం పేద విద్యార్థులకు వరమే. కార్పొరేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పేరిట లక్షల రూపాయలు కట్టాల్సిన బాధ తీరనున్నది. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.