రుద్రూర్/ నందిపేట్/ ఏర్గట్ల, ఏప్రిల్ 9: శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. రుద్రూర్, కోటగిరి మండలాల్లోని రాములవారి ఆలయాలు నవమి వేడుకలకు ముస్తాబయ్యాయి. స్వామివారి కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని అర్చకులు రాజేశ్వర్అప్ప, రాముపంతులు తెలిపారు. నందిపేట్‌లోని రాజానగర్, ఆంధ్రనగర్, ఉమ్మెడ, సిద్ధాపూర్, డొంకేశ్వర్ తదితర గ్రామాల్లో రామాలయాలు, హనుమాన్ మందిరాలు ముస్తాబయ్యాయి. సీతారాముల కల్యాణంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయాల కమిటీ బాధ్యులు తెలిపారు. మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో సాయిబాబా మందిరంలో పూజలు ఉంటాయని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్‌తో పాటు తడ్పాకల్ గోదావరి నది ఒడ్డున ఉన్న రామాలయాలు శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. శనివారం రామాలయం వద్ద హనుమాన్ మాలధారులు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణాన్ని ఆదివారం నిర్వహిస్తామని, భక్తుల కోసం అన్నదానం నిర్వహించనున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, హనుమాన్ మాలధారులు తెలిపారు.
చందూర్ మండల కేంద్రంలో రాములోరి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయి విద్యాలయ అధినేత ఉప్పల మధు భక్తులకు అన్నదానం చేయనున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మోస్రా మండల కేంద్రంలో నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 17వ తేదీన ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
నేడు కందకుర్తిలో కుస్తీ పోటీలు
రెంజల్, ఏప్రిల్ 9: మండలంలోని కందకుర్తి గ్రామంలో ఆదివారం రామాలయ కమిటీ తరఫున కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ ఖలీంబేగ్, ఉప సర్పంచ్ యోగేశ్ తెలిపారు. చివరి కుస్తీ పోటీ లో నెగ్గిన మల్లయోధుడికి 15 తులాలు, రెండో స్థానంలో నిలిచిన మల్లయోధుడికి పది తులాల వెండి కడియం బహూకరిస్తామని పేర్కొన్నారు.