చందూర్/ శక్కర్‌నగర్/ రెంజల్, ఏప్రిల్ 7 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైతులు యాసంగిలో సాగుచేస్తున్న వడ్లను కొనుగోలు చేయాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు, నాయకులు గురువారం నల్ల జెండాలను ప్రదర్శించి, ఇండ్లపై ఎగురవేసి నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, పెట్రోల్, డీజిల్‌తో పాటు ఇతర ధరలు పెంచుతుండడంతో చందూర్ మండలంలోని మేడ్‌పల్లి గ్రామంలో నల్లజెండాలతో నిరసన చేపట్టారు.
పలు ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు శ్యాంరావు, సర్పంచ్ లకావత్ రవి, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తమ ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో నల్ల జెండాలతో నిరసన చేపట్టినట్లు టీఆర్ఎస్ రెంజల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు భూమారెడ్డి, ఆసాని అనిల్ తెలిపారు.