రాష్ట్ర రైతాంగం పండిస్తున్న వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం ఆందోళనలు, దీక్షలు చేశారు. కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. పంజాబ్‌కు ఒకన్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా అంటూ ప్రధానిని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు, నాయకులు రైతులను తప్పుదోవ పట్టించిన తీరును ఎండగట్టారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకపోతే గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. టీఆర్ఎస్ పోరుకు అన్నదాతలు సంఘీభావం తెలుపుతూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్‌లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, డిచ్పల్లి, మోపాల్ మండలాల్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాక్లూర్‌లో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రెడ్డి, ధర్పల్లిలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, చందూర్, మోస్రా, వర్ని, కోటగిరి, రద్రూర్ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ మండలంలో టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి పాల్గొని రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల కార్యవర్గాలు, ఎంపీపీలు, సొసైటీలు, మార్కెట్ కమిటీల పాలకవర్గాలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 4