నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 4 : స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ నారాయణరెడ్డి, ఉన్నతాధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వార్డు మెంబర్, సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువరిస్తామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. న్యాయపరైన అంశాలతో ముడిపడి ఉన్న స్థానాలకు నోటిఫికేషన్ వెలువరించకూడదని, మిగతా ఖాళీ స్థానాల్లో ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 21వ తేదీనాటికి తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా రూపొందించాలని జిల్లా పంచాయతీ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, బ్యాలెట్ బాక్సులు, ఇంక్ బాటిళ్లు తదితర సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు.
అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 132 వార్డులు, 10 సర్పంచ్స్థానాలతోపాటు ఒక ఎంపీటీసీ స్థానం, బోధన్ మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డు స్థానం ఖాళీగా ఉన్నట్లు కమిషనర్‌కు వివరించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వీడియోకాన్పరెన్స్‌లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.