బాన్సువాడ, ఏప్రిల్ 4: స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేది దేశంలో ఒక్క మనరాష్ట్రమే అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని భారతీగార్డెన్లో సోమవారం పీబీఆర్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఇప్పటి వరకు లక్షా 33,947 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో అన్ని శాఖల్లో 80, 039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో కామారెడ్డి జిల్లాలో 1340, నిజామాబాద్ జిల్లాలో 1976 ఖాళీలు భర్తీ కానున్నాయని తెలిపారు. తన నియోజక వర్గం రెండు జిల్లాలతో ముడిపడి ఉన్నందున రెండు జిల్లాల్లో బాన్సువాడ నియోజక వర్గానికి చెందిన యువతకు లబ్ధి చేకూరనున్నదని సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాకుండా 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నట్లు చెప్పారు.
పీబీఆర్ కోచింగ్ సెంటర్‌కు కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల నుంచి 675, నిజామాబాద్ జిల్లా వర్ని, కోటగిరి, రుద్రూర్, చందూర్ , మోస్రా మండలాల నుంచి 400 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. దరఖాస్తు చేసుకున్నవారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. చదువుకు పేదరికం అడ్డుకావచ్చని, కానీ జ్ఞానం, విజ్ఞానానికి కాదన్నారు. ఏకాగ్రత, ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసంలో కష్టపడి ఇష్టంగా చదవాలని సూచించారు. సమయం అత్యంత విలువైనదని, వృథా చేయొద్దన్నారు. లక్ష్యం ఎంచుకొని చదవాలని కోరారు. 60 రోజుల పాటు కష్టపడి చదివితే రాబోవు 60 ఏండ్లు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.బాన్సువాడ కు చెందిన నరేశ్ అనే పేద విద్యార్థి చదువుకుంటానని, తనను కలిశాడని, ఢిల్లీలో సివిల్స్‌తో పాటు గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు తాను లక్షా యా భై వేల రూపాయలను సొంతంగా అందించినట్లు తెలిపారు. తెలంగాణ భవన్లో ఉండేందుకు ఏర్పాటు చేశానని, గతేడాది పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించాడని చెప్పారు.
ఈ నెల 7 నుంచి పీబీఆర్ కోచింగ్ సెంటర్లో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. 60 నుంచి 70 రోజుల వరకు 11 మంది లెక్చరర్లతో ఒక్కో కోచింగ్ సెంటర్లో క్లాసులు చెబుతారని తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల లోపు పరీక్ష నిర్వహిస్తారని, రూ.4500 విలువ చేసే 11 పుస్తకాలను ఉచితంగా అందిస్తారన్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు, సాయంత్రం టీ అందిస్తారని తెలిపారు. అందరూ బాగుండాలన్నదే తన సంకల్పమని అన్నారు.డబ్బులు ముఖ్యం కాదని, ఎంత ప్రయోజం పొందారు అన్నదే ముఖ్యమన్నారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజక వర్గంలో ఉన్న యువత ఆదృష్టవంతులు అని అన్నారు. తాము కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లామని, ఇక్కడి యువత కోసం చదువుకోవడానికి పీబీఆర్ కోచింగ్ సెంటర్‌నే బాన్సువాడలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు లక్ష్యం ఎంచుకొని చదివితే కచ్చితంగా ఫలితాలు సాధిస్తారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , ఏఎస్పీ అనోన్య, ఆర్డీవో రాజాగౌడ్ , డీఎస్పీ జయపాల్ రెడ్డి, పీజేఆర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి , మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ అధ్యక్షుడు వై కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలక్రిష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్‌నాయక్, పెర్క శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.