భీమ్‌గల్, మార్చి 31 : సీఎం కేసీఆర్ కులవృత్తులకు చేయూతనిస్తున్నారని, గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల, కుర్మల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని చేంగల్‌లో గొల్ల, కుర్మలకు రెండో విడుతలో భాగంగా గొర్రెల యూనిట్ల పంపిణీని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ బాల్‌రాజుతో కలిసి మంత్రి పంపిణీని గురువారం ప్రారంభించారు. 47 మంది లబ్ధిదారులకు రూ.70 లక్షల విలువ చేసే గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గొల్ల, కుర్మలకు గొర్రెలను అందిస్తే ఆదాయాన్ని సృష్టించుకోగలుగుతారన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేశారన్నారు. జిల్లాలో ఇప్పటికే రూ.106 కోట్లతో 2,500 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేసినట్లు తెలిపారు. బాల్కొండ నియోజక వర్గంలో 30 కోట్లతో గొర్రెల యూనిట్లను అందించామని చెప్పారు. రెండో విడుతలో యూనిట్ విలువను లక్షా 75 వేలకు పెంచినట్లు తెలిపారు. గొర్రెల యూనిట్లను అందజేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ ఆర్మూర్ మహేశ్ వినతి మేరకు చేంగల్‌లో రూ.1.50 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా నీటి ఎద్దడిని లేకుండా చేశామని అన్నారు.
త్వరలో ప్యాకేజీ – 21 జలాలు..
త్వరలో ప్యాకేజీ-21 జలాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు పక్షం రోజుల్లో పూర్తి కానున్నట్లు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాలన్న తపనతో కేసీఆర్‌ను ఒప్పించి పోచంపాడ్ జలాల మళ్లింపు కోసం రూ. 1,350 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ సభ్యుడు రవి, సర్పంచ్ చిన్నారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్, యాదవ సంఘం జిల్లా నాయకుడు భూమన్న యాదవ్, పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి భరత్ మహాజన్, సహాయ సంచాలకులు బాలిక్ అహ్మద్, బస్వారెడ్డి, నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు గుణ్వీర్రెడ్డి, ముల్క గంగాధర్, తుక్కాజీ నాయక్, పశుసంవర్ధక మండల అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.