నిజామాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతుండడంతో కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. జారవీడుతున్న నేతలను కాపాడుకోలేక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఇద్దరు ఎంపీటీసీలు బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. మూడు రోజుల క్రితం నిజామాబాద్ నగర పాలక సంస్థ బీజేపీ కార్పొరేటర్లు సైతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నిజామాబాద్ జిల్లా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలతో పాటు ఎంపీ అర్వింద్ తీరును నిరసిస్తూ చాలా మంది బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని అబద్ధాలు, అసంబద్ధ వ్యాఖ్యలతో నిందించడం మినహా కేంద్రం ద్వారా మేలు చేసే ఏ ఒక్క కార్యక్రమమూ చేపట్టకపోవడంతో బీజేపీ ప్రజాప్రతినిధుల్లో ఒకింత అసహనానికి గురి చేసింది. ప్రజల ఓట్లతో గెలిచిన వారంతా తిరిగి ప్రజలకు మేలు చేయాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే మార్గమని భావించారు. గులాబీ కండువాను కప్పుకుని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు కారెక్కుతున్నారు. వరుసగా బీజేపీని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీకి జైకొడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. బీజేపీ నుం చి వరుసగా రాజీనామాల పర్వం కొనసాగుతుండడంతో కమలం పార్టీ కకావికలం అవుతున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా చర్చ…
రెండున్నరేండ్ల నుంచి రాష్ట్రంలో పండిన వడ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నది. మర ఆడించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ స్వీకరించకుండా రాజకీయం చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు కావాలని రాజకీయ దురుద్ధేశంతో వడ్ల విషయంలో పేచీలు పెడుతున్నారు. దీంతో తెలంగాణ సమాజం ఒక్కసారిగా కేంద్రంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పలు దఫాలుగా ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇందులో సామాన్య ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి కేంద్రానికి తమ వ్యతిరేకతను చాటి చెప్పారు. తాజాగా తీర్మానాల పేరిట ప్రధానమంత్రి మోదీకి తెలంగాణ సమాజ ఆకాంక్షలను తెలియజేసేందుకు కార్యక్ర మం జరిగింది. ఇందులో తొలి రోజు గ్రామ పంచాయతీ తీర్మానాలు జోరుగా జరిగాయి. రెండో రోజు మండల పరిషత్‌లలో ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించి ప్రధానికి పంపించారు. ఇందులో నిజామాబాద్ జిల్లా రెంజల్, డిచ్పల్లి మండలాల్లో బీజేపీకి చెందిన ఎంపీపీలు లోలపు రజని, భూమన్న సైతం నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు మండలాలకు చెందిన బీజేపీ ఎంపీపీలు తీసుకున్న చొరవను రైతులు ప్రశంసిస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తీర్మానాల రూపంలో ఎంపీపీలు సంఘీభావం ప్రకటించడాన్ని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం స్వాగతిస్తున్నారు.
విశ్వాసం కోల్పోతున్న ఎంపీ అర్వింద్..
నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ సొంత పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల విశ్వాసం కోల్పోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేక చతికిల పడిన ఎంపీపై ఇంటా బయట వ్యతిరేకత పెరుగుతున్నది. పసుపు బోర్డు అంశంపై రైతన్నలంతా ఎంపీని వెంటాడుతున్నా రు. ఈ దశలోనే నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్లు అర్వింద్ తీరును ఆది నుంచి తప్పు పడుతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన తాము జనానికి మేలు చేయాలంటే టీఆర్ఎస్ పార్టీయే చక్కని వేదిక అని ఎలుగెత్తి చాటుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంపీగా ధర్మపురి అర్వింద్ తీసుకుంటున్న చొరవ శూన్యమంటూ విమర్శిస్తున్నారు. నిత్యం నోటి మాటలే తప్ప అభివృద్ధిలో పోటీ పడలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తూ రెచ్చగొట్టడం సరికాదంటూ సొంత పార్టీ నేతలే గుస్సా అవుతున్నారు. ఎంపీ అర్వింద్‌కు గతంలోనే కార్పొరేటర్లంతా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోకపోతే బీజేపీని వదులుతామని తేల్చి చెప్పారు. ఎంపీ అర్వింద్ వ్యవహార శైలి మారలేదు సరికదా అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించకపోవడం వంటి కారణాలతో కమలం పార్టీకి టాటా చెప్పి కారెక్కేశారు. 39వ డివిజన్ కార్పొరేటర్ నిచ్చేంగు లతాకృష్ణ, 44వ డివిజన్ కార్పొరేటర్ బైకాన్ సుధామధులు బీజేపీకి గుడ్‌బై చెప్పారు. గత నెలలో ఆర్మూర్ మండలం చేపూర్ ఎంపీటీసీ, రెంజల్ మండలం నీలా ఎంపీటీసీ సైతం బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఇలా వరుస పెట్టి బీజేపీలో కార్యకర్తలుగా కొనసాగుతున్న వారంతా టీఆర్ఎస్లోకి వచ్చేస్తున్నారు.
పెరుగుతున్న వలసలు…
గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి నిజామాబాద్ జిల్లా కంచుకోటగా కొనసాగుతున్నది. ఉద్యమం నాటి నుంచి నేటి వరకు ఉభయ జిల్లాల ప్రజలం తా కేసీఆర్‌కే మద్దతు పలుకుతున్నారు. జాతీయ పార్టీలకు కనీసం డిపాజిట్ దక్కకుండా ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే ప్రజలంతా పట్టం కడుతున్నారు. వరుసగా ఏ ఎన్నికలొచ్చినా ఏకపక్ష విజయాలను అందిస్తున్నారు. సమైక్య పాలనలో అడుగడుగునా తీవ్రమైన నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తనదైన శైలిలో పరిపాలిస్తున్నారు. ఎనిమిదేండ్లుగా అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని ముందు వరుసలో నిలబెట్టి దేశంలోనే తెలంగాణకు ప్రత్యేకత గుర్తింపును తీసుకువచ్చారు. కేసీఆర్ కృషితో రాష్ట్రం కొంగొత్త విజయాలను సొంతం చేసుకుంటుండగా ప్రజల్లోనూ చిరస్థాయి గుర్తింపు ను సాధించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల నుంచి పెద్ద ఎత్తున వలసలు టీఆర్ఎస్కు కొనసాగుతున్నాయి. 27వ తేదీన వర్ని మండలంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సంస్థాగతంగా బలోపేతమైంది. గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలు, అనుబంధ సంఘాల కార్యవర్గాల కూ ర్పుతో జోష్ కనిపిస్తున్నది.