నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అన్ని మండల కేంద్రాల్లో మోదీ దిష్టిబొమ్మలకు బుధవారం శవయాత్రను నిర్వహించి దహనం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆర్మూర్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మోదీ డౌన్‌డౌన్ అంటూ తెలంగాణ వాదుల నినాదాల మధ్య కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనను రోల్ మోడల్‌గా వర్ణించిన నోటితోటే తెలంగాణపై ఇంతటి విషం కక్కుతావా అంటూ మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఉద్యమకారుల ప్రాణత్యాగాలు, కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అపహాస్యం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంపై చూపుతున్న వివక్షపై సీఎం కేసీఆర్ నిలదీస్తున్నారనే అక్కసుతోనే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నార్థకం చేస్తున్నారని అన్నారు. ఎన్డీఏ అంటే నేషనల్ డిస్ట్రక్టివ్ అలయన్స్గా తయారైందన్నారు. తెలంగాణ జోలికి వస్తే బీజేపీని నేలకేసి కొడతామన్నారు. ఆయన నరేంద్ర మోదీ కాదు.. నరేం ద్ర మోరీ అంటూ ఎద్దేవా చేశారు. ఉద్యమంలో ఎన్నడూ బీజేపీ నాయకులు వీధుల్లోకి వచ్చి కొట్లాడలేదని గుర్తుచేశారు. ఐటీఐఆర్, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారంలో స్టీల్ కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీలను గుర్తుచేస్తూ రాష్ర్టానికి మోదీ చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు. కేటీఆర్ పిలుపుమేరకు కార్యక్రమాలను విజయవంతం చేసిన వారందరికీ జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్, ఆర్మూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు పీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.