– నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్
రామగిరి, ఫిబ్రవరి 23 : నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్యమార్గాలు బోధించిన సంత్ సేవాలాల్ మహారాజ్‌ను ఆదర్శంగా తీసుకుని సమాజం ముందుకెళ్లాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ లంబాడా, గిరజన జాతిలోని మూఢ నమ్మకాలను పారద్రోలి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో రూపొందించిన రాజ్యాంగం, హక్కులు, ప్రభుత్వ పథకాలను పేద, నిమ్న వర్గాలకు అందించేందుకు ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. ఎస్టీ, బంజారాలకు సమాజ స్థితిగతులను తెలియజేశారని, సంత్ సేవాలాల్ నీతి, న్యాయం, ధర్మాన్ని పాటించాలన్న వారి మార్గదర్శకాలను, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆధ్యాత్మిక గురువని, సేవ, ధర్మం సమ భావనలను బోధించారని, సత్సంగ్ ద్వారా సమాజాన్ని మంచి మార్గంలో పయనించేందుకు కృషి చేశారన్నారు. సమావేశానికి ప్రవీణ్ నాయక్ అధ్యక్షత వహించగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, లంబాడ హక్కుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్, ఎరుకల సంఘం అధ్యక్ష్యుడు నరసింహ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేశ్, డిప్యూటీ మేయర్ అశ్రఫ్ అలీ, తాసీల్దార్ పరశురాం, కార్పొరేటర్లు దీప్లా నాయక్, నాగార్జున, రవి నాయక్ పాల్గొన్నారు.

‘సంత్ సేవాలాల్ మహారాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి’